యువతపై జనసేనాని ఫోకస్!
Janasena focus on youth.పవన్ కల్యాణ్.. ఆ పేరు చెబితే చాలు యువత ఉర్రూతలూగుతుంది.
By సునీల్ Published on 16 Aug 2022 7:31 AM GMT- ఐటీ కో ఆర్డినేటర్లతో ప్రచారానికి ఊపు
- మండల స్థాయిలో కమిటీలకు రూపు
- అక్టోబర్ 5 నుంచి రాష్ట్రవ్యాప్త యాత్ర
పవన్ కల్యాణ్.. ఆ పేరు చెబితే చాలు యువత ఉర్రూతలూగుతుంది. సినిమా హీరోగా తనదైన ముద్ర వేసుకున్న పవన్ జనసేనానిగా మాత్రం ఆ స్థాయిలో జన నాడి పట్టలేకపోయారు. గత ఎన్నికల్లో ఎదురైన ఓటమిలోని లోపాలను విశ్లేషించుకుని కొత్త ఉత్సాహతో జనంలోకి వెళ్లాలని నిర్ణయించారు. ప్రధానంగా రాష్ట్రంలోని యువతను లక్ష్యంగా చేసుకుని తిరుపతి నుంచి యాత్ర చేపట్టబోతున్నారు.
ఐటీ రంగంలో యువోత్సాహం
ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో భారతీయుల సంఖ్య అత్యధికంగా ఉంది. ప్రతి వంద మంది ఐటీ నిపుణుల్లో 20 మంది భారతీయులు ఉండగా.. ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదుగురు ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఐటీ రంగంలోని యువతను పార్టీకి పక్కాగా ఉపయోగించుకోవాలని జనసేనాని వ్యూహం పన్నారు. ఇటీవల నిర్వహించిన ఐటీ విభాగం సమావేశంలోనూ ఆ రకంగానే ఫోకస్ చేశారు. చదువుకుని, ఉద్యోగం చేస్తున్న ఐటీ యువత ద్వారా చేసే ప్రచారం జనంలోకి లోతుగా వెళ్తుందనే అంచనాలు వేస్తున్నారు.
సరికొత్త పాలసీతో ప్రచారం
జనసేన అధికారంలోకి వస్తే సరికొత్త ఐటీ పాలసీ తెస్తామని జనసేనాని పవన్ కల్యాణ్ చెబుతున్నారు. మన యువత విదేశాలకు వెళ్లడం కాకుండా.. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువస్తామంటూ ఆకర్షిస్తున్నారు. పారిశ్రామికవేత్తలను ఆకర్షించే విధంగా జనసేన పార్టీ ఐటీ పాలసీ ఉంటుందంటున్నారు. జనసేన మేనిఫెస్టోలో ఐటీ రంగ అభివృద్ధికి ప్రత్యేక స్థానం కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న ఐటీ రంగానికి ఏపీని వేదికగా తీర్చిదిద్దుతామంటూ హామీ ఇచ్చారు. తెలంగాణకు హైదరాబాద్ ఐటీ రంగానికి కేంద్రంగా ఉంటే.. ఏపీలో తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. జనసేనాని ఈ ప్రచారం యువతను బలంగా ఆకర్షించినట్లే కనిపిస్తోంది.
యాత్ర లోపు మండల స్థాయి ఐటీ కో ఆర్డినేటర్లు
రాష్ట్రంలో యువ ఓటర్ల సంఖ్య ఎక్కువే. వారిని ఆకట్టుకోవాలంటే ఉద్యోగ మంత్రం జపించాలి. పవన్ కల్యాణ్ అదే ఆలోచనతో మండల స్థాయిలో ఐటీ కో ఆర్డినేటర్లను నియమిస్తున్నారు. ఇప్పటికే 130 నియోజకవర్గాల్లో ఐటీ కో ఆర్డినేటర్లను నియమించారు. జిల్లాలకు నియామకం పూర్తయ్యింది. అక్టోబర్ 5వ తేదీన పవన్ యాత్ర మొదలు కాబోతోంది. ఆలోపే రాష్ట్రంలోని 670 మండలాలకు ఐటీ కో ఆర్డినేటర్ల నియామకం పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. అలాగే జనసేన కోసం ప్రస్తుతం 14 వేల మంది ఐటీ వాలంటీర్స్ పని చేస్తున్నానరు. ఆ టీంను లక్ష మందికి చేర్చాలని టార్గెట్ పెట్టారు. ఐటీ విభాగం కోసం అస్త్ర యాప్ కూడా తెస్తున్నారు.
అంతా ఆన్లైన్ ప్రచారమే..
2014 ఎన్నికల్లో టెక్నాలజీని ఉపయోగించుకుని కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో ఏ వెబ్ సైట్, ఏ యాప్ తెరిచినా బీజేపీ జెండా, అజెండా కనిపించేవి. అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో టెక్నాలజీ ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ప్రతి నాయకుడు ప్రత్యేకంగా సోషల్ మీడియా కోసం ఒకరిని నియమించుకుని ప్రచారం చేయించుకుంటున్నారు. ఏ చిన్న పని చేసినా లక్షలాది మందికి చేర్చేందుకు సోషల్ మీడియా అవకాశం కల్పిస్తోంది. జనసేనాని కూడా ఐటీ విభాగం ద్వారా ప్రతి ఒక్కరికీ తమ అజెండాను తీసుకెళ్లాలని భావిస్తున్నారు. అందుకోసం యువతను ఆకర్షించే ఐటీ మంత్రాన్ని జపిస్తున్నారు.