వైసీపీలో టికెట్ల టెన్షన్!
Jagan's focus on the appointment of co-ordinators.వైసీపీలో టికెట్ల టెన్షన్ కనిపిస్తోంది.
By సునీల్ Published on 25 Aug 2022 9:07 AM GMTవైసీపీలో టికెట్ల టెన్షన్ కనిపిస్తోంది. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ నుంచి నియోజకవర్గాలపై దృష్టి సారించారు వైసీపీ అధినేత జగన్. సర్వేల్లో పనితీరు సరిగా లేనట్లు గుర్తించిన నియోజకవర్గాల్లో సమన్వయకర్తలను నియమించే ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో కో ఆర్డినేటర్‌ను నియమించిన విషయం తెలిసిందే. తాడికొండ నుంచి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజాగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ను కో ఆర్డినేటర్‌గా నియమించారు.
అదే బాటలో మరిన్ని..
వైఎస్సార్సీపీ నిర్వహించిన అంతర్గత సర్వే ప్రకారం పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి ఉన్నట్లు గుర్తించారు. మరికొన్నింట్లో అయితే వ్యతిరేకత కూడా వ్యక్తమవుతున్నట్లు తేలింది. అటువంటి చోట్ల అభ్యర్థుల మార్పు తప్పదనే సంకేతాలు ఇవ్వాలని అధిష్టానం భావిస్తోంది. అందుకోసం దాదాపు 60 నియోజకవర్గాల్లో సమన్వయకర్తలను నియమించబోతోంది. 2019లో 175కు 151 స్థానాల్లో వైసీపీ గెలిచింది. ఈసారి కూడా ఆ నెంబర్‌ను చేరుకోవాలంటే పలు స్థానాల్లో మార్పులు తప్పదనే నిర్ణయానికి వచ్చింది.
ఒక్క చాన్స్ ఇచ్చేశారు
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క చాన్స్ అంటూ ఎన్నికలకు వెళ్లిన వైసీపీ నేతలకు ప్రజలు పట్టం కట్టారు. ఆ ఒక్క చాన్స్‌ను సద్వినియోగం చేసుకోలేని ఎమ్మెల్యేలకు అదే లాస్ట్ చాన్స్‌గా మిగిలిపోతుందని అధిష్టానం హెచ్చరిస్తోంది. పనితీరు బాగాలేదని గుర్తించిన 58 అసెంబ్లీ, 12 ఎంపీ స్థానాల్లో కో ఆర్డినేటర్లను నియమించడంపై దృష్టి సారించింది. ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేలుగా నిలబడగలిగిన ఆర్థిక, అంగ బలమున్న నాయకులను ఎంపిక చేస్తోంది. ఇప్పటికే ఆ జాబితా సీఎం జగన్ వద్దకు చేరినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పథకాలిస్తున్నా ప్రయోజనం లేకుంటే ఎలా?
2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యే సమయానికి రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉంది. ఏడాదిలోనే కరోనా విరుచుకుపడింది. రెండేళ్లపాటు కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థ వెనక్కు వెళ్లిపోయింది. అయినా పథకాలేవీ ఆగకుండా కొనసాగిస్తూ వస్తోంది ప్రభుత్వం. అప్పులు చేసో, తిప్పలు పడో పథకాలు అమలు చేస్తున్నారు. వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమవుతున్న ఎమ్మెల్యేలకు చెక్ పెట్టకపోతే రాబోయే ఎన్నికల్లో విజయం సాధించడం కష్టమనే అంచనాకు పార్టీ వచ్చింది. సర్వేలో గుర్తించిన నేతలకు గతంలోనే జగన్ హెచ్చరికలు జారీ చేశారు. పనితీరు మార్చుకునేందుకు లాస్ట్ చాన్స్ అంటూ సూచించారు. సొంత పార్టీలో ఉండి అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వారిపై సీరియస్‌గా చర్యలు తీసుకుంటామనే సంకేతాలు ఇస్తున్నారు. ఎమ్మెల్యేలకు అదనంగా కో ఆర్డినేటర్లను నియమించి, వారిలో టెన్షన్ పుట్టేలా చేస్తున్నారు.
ముఖ్యంగా టీడీపీ సీట్లలో..
గత ఎన్నికల్లో టీడీపీ గెలిచిన సీట్లలో నియోజకవర్గాల ఇన్ చార్జుల పనితీరుపై వైసీపీ అధిష్టానం ప్రత్యేక ఫోకస్ సారించింది. టీడీపీ గెలిచిన 3 ఎంపీ సీట్లు, 23 అసెంబ్లీ సీట్లలో ఈసారి ఎలాగైనా గెలవాలని భావిస్తోంది. ముఖ్యంగా విజయవాడ ఎంపీ సీటును కైవసం చేసుకోవడాన్ని ముఖ్యమైన టాస్క్‌గా పెట్టుకుంది. అలాగే అనంతపురం, హిందూపురం, నెల్లూరు, బాపట్ల, విజయవాడ, ఏలూరు, నరసాపురం, అమలాపురం, అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం నియోజకవర్గాల్లో పట్టు బిగించేందుకు అదనపు సమన్వయకర్తలను నియమించాలని నిర్ణయించింది.