జగన్ 2.0: విజయవాడ తూర్పు నుంచి పోటీ చేయనున్న దేవినేని అవినాష్..!
Jagan 2.0: Devineni Avinash to contest from Vijayawada East.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి
By న్యూస్‌మీటర్ తెలుగు
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి దేవినేని అవినాష్‌ను వైఎస్‌ఆర్‌సీపీ బరిలోకి దించే అవకాశం ఉంది. విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పార్టీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు సీఎం సూచన ప్రాయంగా తెలియజేశారు.
దేవినేని అవినాష్ ఎవరు?
ప్రస్తుతం విజయవాడ తూర్పు (అసెంబ్లీ నియోజకవర్గం) ఇన్‌ఛార్జ్‌గా ఉన్న అవినాష్ 2019లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019లో కొడాలి శ్రీ వెంకటేశ్వరరావుపై గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పుడు ఆయనకు ప్రజల నుంచి ప్రత్యేకించి యువత నుంచి మంచి మద్దతు లభించింది. దేవినేని కుటుంబ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లిన ఆంధ్రప్రదేశ్‌లోని అతి పిన్న వయస్కుల్లో అవినాష్ ఒకరు.
34 ఏళ్ల అవినాష్ విజయవాడలో తన తండ్రి దేవినేని నెహ్రూ స్థాపించిన యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (USO) అధ్యక్షుడిగా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆయన తండ్రి ఎన్టీ రామారావు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. కంకిపాడు మండలం నుంచి ఐదుసార్లు ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో అవినాష్ ఓడిపోయినా, తన ఉనికిని మాత్రం చాటుకున్నారు. నవంబర్ 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
గడప గడపకూ సమావేశం
క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమం ప్రాధాన్యతను జగన్ నొక్కి చెప్పారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ వారి అభిప్రాయాలను తెలుసుకోవాలన్నారు. పార్టీని అట్టడుగు స్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు ప్రతి 50 నుంచి 70 ఇళ్లకు సచివాలయాల వారీగా కన్వీనర్లను, సభా ప్రధానాధికారులను నియమిస్తున్నామని, వారు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని సీఎం చెప్పారు.
విజయవాడ తూర్పు నియోజకవర్గాన్ని ప్రస్తావిస్తూ.. 21 వార్డులకు గాను 14 వార్డులు పార్టీ కైవసం చేసుకున్నాయని, ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నా ఎక్కువ వార్డులు గెలుచుకోగలిగామని జగన్ అన్నారు. గడిచిన మూడున్నరేళ్లలో ప్రభుత్వం చేసిన మంచి పనులను ముందుకు తీసుకెళ్లి ఎన్నికలకు సిద్ధం కావాలని కోరారు.
పార్టీ క్యాడర్ అంతా కలిసి పార్టీ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ఎవరికి ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించాలని, అర్హులందరికీ సంక్షేమం అందాలని, వివిధ కారణాలతో లబ్ధి పొందడంలో దూరమైన వారికి ఏడాదిలో రెండు సార్లు అందిస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వాలు ఎలాంటి విప్లవాత్మక ముందడులు వేయలేదని సీఎం జగన్ అన్నారు.