కొల్లాపూర్‌లో హీటెక్కిన రాజకీయం.. ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి అరెస్ట్
High Tension in Kolhapur.నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్‌లో ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు,
By తోట వంశీ కుమార్ Published on 26 Jun 2022 6:17 AM GMTనాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్‌లో ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి పరస్పర సవాళ్లే ఇందుకు ప్రధాన కారణం. నియోజకవర్గం అభివృద్ధి, అవినీతి ఆరోపణలపై పరస్పర విమర్శలు గుప్పించుకున్న ఈ ఇద్దరు నేతలు.. ఆదివారం కొల్లాపూర్‌లోని అంబేద్కర్ సెంటర్ వేదికగా ముఖాముఖి చర్చకు సిద్దమయ్యారు. ఈ క్రమంలో శనివారం రాత్రికే ఇద్దరూ కొల్లాపూర్‌కు చేరుకున్నారు.
పరస్పర సవాళ్ల కారణంగా శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని బావించిన పోలీసులు అప్రమత్తం అయ్యారు. జూపల్లి కృష్ణారావుతో చర్చకు వెలుతుండగా ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటికే అక్కడికి చేరుకున్న హర్షవర్ధన్ అనుచరులు పోలీసుల వాహనాన్ని కదలనీయకుండా అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరకు పోలీసులు హర్షవర్ధన్‌ను అక్కడి నుంచి తరలించారు. దీంతో కొల్లాపూర్ బస్టాండ్ వద్ద ఎమ్మెల్యే అనుచరులు ఆందోళనకు దిగారు.
పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ తగ్గేదే లే అని అంటున్నారు ఎమ్మెల్యే హర్షవర్థన్ రెడ్డి. జూపల్లితో చర్చకు తాను సిద్దమని వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. ఇంటికి వస్తామంటే అంబేద్కర్ చౌరస్తాకు రమ్మన్నారని, ఇప్పుడు అంబేద్కర్ చౌరస్తాకు జూపల్లి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు.
మరోవైపు.. ఎమ్మెల్యే ఆరోపణలపై జూపల్లి అంతే ఘాటుగా స్పందించారు. తనను ఎదుర్కొన లేనని తెలిసే బీరం హర్షవర్షన్ రెడ్డి డ్రామాలు చేస్తున్నారన్నారు. తప్పు చేసినోడు తలవంచుకుని వెళతాడు, తాను ఏ తప్పు చేయలేదని అన్నారు. నా రాజీకీయ జీవితంపై ఆరోపణలు చేశారు. కొల్లాపూర్ అంబేడ్కర్ చౌరస్తాకు రమ్మని సవాల్ విసిరా.. సవాల్ స్వీకరించకుండా నా ఇంటికే వస్తానన్నారు. నా ఇంటికి వస్తానన్న హర్షవర్షన్ ఇప్పటి వరకు రాలేదు. మధ్యాహ్నం వరకు హర్షవర్షన్ కోసం ఎదురుచూస్తా. తరువాత నా కార్యాచరణ ప్రకటిస్తా. మా ఇద్దరి మధ్య ఉన్న తగాదాలతో టీఆర్ఎస్‌కు ఎలాంటి సంబంధం లేదని జూపల్లి తెలిపారు.