గ్యారెంటీలు ఎప్పట్నుంచి అమలు చేస్తారో క్లారిటీ లేదు: హరీశ్‌రావు
బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరు గ్యారెంటీల అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు.
By Srikanth Gundamalla Published on 31 Dec 2023 4:58 PM ISTగ్యారెంటీలు ఎప్పట్నుంచి అమలు చేస్తారో క్లారిటీ లేదు: హరీశ్‌రావు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆరు గ్యారెంటీల అమలుపై దృష్టి పెట్టింది. ఇప్పటికే ప్రజాపాలన పేరుతో ప్రజల నుంచి గ్యారెంటీల కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈనేపథ్యంలో బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరు గ్యారెంటీల అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు కానీ.. ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి చూస్తుంటే పార్లమెంట్ ఎన్నికల కోడ్ సాకుగా చూపి హామీల అమలును చేయరేమో అనిపిస్తోందని అన్నారు.
దరఖాస్తుల స్వీకరణ పేరుతో పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చే వరకు సాగదీస్తారనీ.. ఆ తర్వాత ఎన్నికల కోడ్ సాకుగా చూపి ఆరు గ్యారెంటీల అమలుపై జాప్యం చేస్తారని హరీశ్‌రావు అనుమానం వ్యక్తం చేశారు. అయితే. ఫిబ్రవరిలోనే పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని చెప్పారు. గైడ్‌లైన్స్ లేకుండా దరఖాస్తుల స్వీకరణ జరుగుతోందనీ.. నిజానికి మొదట గైడ్‌లైన్స్ విడుదల చేయాలని అలా ఎందుకు చేయలేదని మాజీ మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీల అమలు ఎప్పట్నుంచి జరుగుతుందనే దానిపై అస్సలు స్పష్టత లేదన్నారు. కోడ్ ఇబ్బంది రావొద్దు అంటే పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఫిబ్రవరి మూడో వారంలోపు నిబందనలు విడుదల చేసి ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. ఈ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని హరీశ్‌రావు కోరారు.
ఇక రైతులకు బోనస్ ఇవ్వడంపైనా ఇప్పుడే నిర్ణయం తీసుకునీ.. ఆ మేరకు ఒక జీవో ఇవ్వాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. రైతుబంధు డబ్బులు ఎంతమంది ఖాతాల్లో.. ఎన్ని నిధులు జమ చేశారో ఎందుకు శ్వేతపత్రం ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కరోనా కాలంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా రైతుబంధు డబ్బులు అందజేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ అని గుర్తు చేశారు. రైతుల పట్ల ప్రేమ ఉంది కాబట్టే అలా చేశామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరు చూస్తుంటే కోతలు, దాటవేత, ఎగవేతలకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా ఉందన్నారు హరీశ్‌రావు. ఇక కార్ల అంశంపైనా స్పందించిన హరీశ్‌రావు.. కేసీఆర్ కార్లను కొన్నది నిజమన్నారు. బీపీ కోసం ఇచ్చింది నిజమని చెప్పారు. ప్రభుత్వం కోసం కొన్న కార్లు అనీ.. అది ప్రజల ఆస్తి అని చెప్పారు. మీరు కూడా వాడుకోవాలని సూచించారు. కార్లకు బీపీ చేసే మెకానిజం విజయవాడలో ఉందనేది చెప్పారు మాజీ మంత్రి హరీశ్‌రావు. కానీ.. కార్లను విజయవాడలో దాచారంటూ విమర్శలు చేయడం ఏమాత్రం సబబుకాదని హితవు పలికారు.