అజిత్ సింగ్ మరణం.. కేసీఆర్, చిరంజీవి దిగ్బ్రాంతి

Former Union Minister Ajit Singh passed away.రాష్ట్రీయ లోక్‌ దళ్‌ (ఆర్‌ఎల్‌డీ) అధినేత, కేంద్ర మాజీ మంత్రి అజిత్‌సింగ్‌ కరోనాతో కన్నుమూశారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 May 2021 3:28 PM IST
Ajit Singh

రాష్ట్రీయ లోక్‌ దళ్‌ (ఆర్‌ఎల్‌డీ) అధినేత, కేంద్ర మాజీ మంత్రి అజిత్‌సింగ్‌ కరోనాతో కన్నుమూశారు. ఆయన వయసు 82 సంవత్సరాలు. గత కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడి గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుప‌త్రిలో చేరి, చికిత్స తీసుకున్నారు. ప‌రిస్థితి విష‌మించడంతో ఆయన మృతి చెందిన‌ట్లు వైద్యులు తెలిపారు. మాజీ ప్రధాని చరణ్‌సింగ్‌ కుమారుడు అజిత్‌సింగ్‌. ఆయ‌న‌ రాజ్యసభ, లోక్‌సభ సభ్యుడిగానూ పని చేశారు. యూపీఏ హయాంలో పౌర విమానయాన మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అజిత్ సింగ్ మృతి ప‌ట్ల రాష్ట్ర‌ప‌తి కోవింద్, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పాటు ప‌లువురు సంతాపం వ్య‌క్తం చేశారు.

అజిత్ సింగ్ మరణం ప‌ట్ల తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. కేంద్ర మంత్రిగా కీలక బాధ్యతలను చేపట్టిన అజిత్ సింగ్.. మాజీ ప్రధాని చరణ్ సింగ్ వారసత్వాన్ని సమర్థవంతంగా కొనసాగించారని, రైతునేతగా భారత రాజకీయాల్లో తనదైన ముద్రవేశారని సీఎం తెలిపారని టీఆర్ఎస్ పార్టీ ట్విట్ట‌ర్‌లో పేర్కొంది. తెలంగాణ ఉద్యమానికి, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం సాగిన రాజకీయ ప్రక్రియకు అజిత్ సింగ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారని కేసీఆర్‌ గుర్తు చేసుకున్నారని తెలిపింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు మద్దతు పలికిన వారి జ్ఞాపకాలను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ గుర్తించుకుంటారని అన్నారని.. అజిత్ సింగ్ కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారని చెప్పింది.

అజిత్‌సింగ్ మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం తెలిపారు. అజిత్‌సింగ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్న‌ట్లు ఆయన ట్వీట్ చేశారు. పార్లమెంటు సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా ఆయ‌న గొప్ప సేవలందించారని, ఆయ‌న‌ రైతుల కోసం పోరాడార‌ని అన్నారు.

అజిత్ సింగ్ మృతి పట్ల సినీ నటుడు చిరంజీవి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తనతో పాటు అజిత్ సింగ్ కూడా కేంద్ర మంత్రివర్గంలో సేవలు అందించారని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. అజిత్ సింగ్ రైతు పక్షపాతి అని చిరంజీవి కొనియాడారు. విమానయాన మంత్రిగా, ఆర్ఎల్ డీ పార్టీ అధినేతగా సమూల సంస్కరణలు తీసుకువచ్చారని వివరించారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని చిరంజీవి తెలిపారు.



Next Story