దసరాకు ఎన్నికల కేబినెట్!
Election Cabinet for Dussehra.ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.
By సునీల్ Published on 9 Sept 2022 2:07 PM ISTఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అధికార, ప్రతిపక్షాలు ఏ నిర్ణయాన్నైనా ఎన్నికల దృష్టితోనే తీసుకుంటున్నాయి. అందులో భాగంగా అన్ని పార్టీలు ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలు ప్రారంభించాయి. మరోవైపు అధికార వైసీపీ ఎన్నికలే లక్ష్యంగా మంత్రివర్గ పునర్వ్యస్థీకరణకు పూనుకుంటోంది. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గాన్ని మారుస్తానన్న ముఖ్యమంత్రి జగన్ కొంతమందిని కొనసాగించి, ఎక్కువ మందిని మంత్రివర్గంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే కొనసాగుతున్న వారిలో ముగ్గురి పనితీరు పట్ల అసంతృప్తితో ఉన్న అధినేత ఉద్వాసన పలకాలని నిర్ణయించారట.
ఆ ముగ్గురు ఎవరు?
మంత్రివర్గం నుంచి తొలగించే ఆ ముగ్గురు ఎవరనే చర్చ సర్వత్రా జరుగుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై ఆరు నెలలుగా పరిశీలన జరిపిన సీఎం జగన్ ముగ్గురిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆ ముగ్గురు కూడా మొదటినుంచి మంత్రివర్గంలో ఉన్నవారే. వారిలో రాయలసీమకు చెందిన మంత్రి ఒకరుండగా.. మిగతా ఇద్దరూ ఉభయ గోదావరి జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ముగ్గురిలో ఒక మహిళా మంత్రి కూడా ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
శాఖల మార్పుపైనా కసరత్తు
విజయ దశమిలోగా చేపట్టబోయే మంత్రివర్గ పునర్వ్యస్థీకరణలో ముగ్గురికి ఉద్వాసన పలకడంతోపాటు పలువురి శాఖలు మారతాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దూకుడుగానే కాకుండా ఆలోచనతో కౌంటర్ ఇచ్చే నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని అధినేత ఆలోచన. ఏపీలో ఇప్పటికే ఎన్నికల హీట్ మొదలైన నేపథ్యంలో మంత్రివర్గాన్ని ఆచితూచి కూర్చాలని భావిస్తున్నారు. తొలగించిన వారి స్థానంలో తీసుకునే వారంతా యువ నేతలే ఉండనున్నట్లు సమాచారం. పనిలో పనిగా పోర్ట్ ఫోలియోలనూ మార్చేస్తే ఎన్నికల కేబినెట్ రెడీ అయినట్లే అనేది అధిష్టానం ఆలోచనగా ఉంది.
ఇటీవల సమావేశంలో ఆగ్రహం
ముఖ్యమంత్రి నేతృత్వంలో ఇటీవల నిర్వహించిన కేబినెట్ సమావేశంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలపై అధినేత ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోకుంటే మార్పు తప్పదని హెచ్చరించారు. గడప గడపకూలో వస్తున్న వ్యతిరేకతను పోగొట్టుకోవడానికి ఏమేం చేయాలో ఆలోచించుకోవాల్సిన బాధ్యత సదరు నేతలపైనే ఉందని స్పష్టం చేశారు. ఈ ఏడాది పని తీరే రాబోయే ఎన్నికల్లో సీట్ల కేటాయింపునకు ప్రామాణికంగా ఉంటుందని సూచించారు. పథకాలు ఇవ్వడమే కాదని, ఇచ్చినట్లు చెప్పుకోవడం కూడా ముఖ్యమేనని దిశానిర్దేశం చేశారు. వ్యక్తుల కన్నా పార్టీ ముఖ్యమని, ఎవరైనా ఫీలయినా చేయగలిగిందేమీ లేదని తేల్చి చెప్పారు. ఆ నేతలు ఎవరో ఎవరికి వారు ఆత్మవిమర్శ చేసుకుంటే అర్థమవుతుందని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు పార్టీ కార్యక్రమాలను సీరియస్ గా తీసుకోని నేతల్లో సీఎం వార్నింగ్‌తో టెన్షన్ మొదలైంది.