ఢిల్లీ వేదికగా కొత్త రాజకీయం
Delhi as a platform for new politics.ఆంధ్రప్రదేశ్‌లో విచిత్ర రాజకీయ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఏ రాష్ట్రంలోనైనా అధికార
By సునీల్ Published on 9 Aug 2022 7:03 AM GMT- ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ
- ఆ వెంటనే జగన్ లంచ్ మీటింగ్
- పవన్‌నూ ఆహ్వానించిన పీఎంవో
- మూడు పార్టీలతో టచ్‌లో ఉంటున్న బీజేపీ
ఆంధ్రప్రదేశ్‌లో విచిత్ర రాజకీయ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఏ రాష్ట్రంలోనైనా అధికార, ప్రతిపక్షాలు ఉంటాయి. కేంద్రంలోని అధికార పార్టీకి మద్దతిచ్చే, విభేదించే పార్టీలు ఉంటాయి. కానీ ఏపీలో అధికార, ప్రతిపక్షాలు కేంద్రంలోని బీజేపీకే జై అంటున్న పరిస్థితి ఉంది. ఇటీవల జరిగిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇరు పార్టీలు బేషరతుగా కేంద్రానికి మద్దతునివ్వడాన్ని చూశాం. కేంద్రానికి రాష్ట్ర ఓట్ల అవసరం ఉన్నప్పటికీ ఏ షరతులు లేకుండా జై కొట్టడం కొత్త రాజకీయంగా కనిపిస్తోంది.
దేశ రాజధానిలో నయా సమీకరణం
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అడగకపోయినా ఏపీ పార్టీలు పోటీ పడి మద్దతిచ్చాయి. తాజాగా ఢిల్లీలో మోదీతో ఒకరి తర్వాత మరొకరు భేటీ కావడం చర్చనీయాంశమవుతోంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట 75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్రం కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వీటికి హాజరయ్యేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. ఆ మరుసటి రోజే నీతి ఆయోగ్ సమావేశానికి సీఎం జగన్ హాజరయ్యారు. ఇరు నేతల ఢిల్లీ పర్యటనలో మోదీతో చర్చించడం విశేషం.
నాలుగేళ్ల తర్వాత కలయిక
2019 ఎన్నికలకు ఏడాది ముందు కేంద్రంతో విభేదించిన టీడీపీ పొత్తు నుంచి బయటకు వచ్చింది. అదే సమయంలో ప్రధాని మోదీపై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాజయం దక్కి, 23 సీట్లే వచ్చాయి. అప్పటి నుంచి ప్రధానిని కలిసే ప్రయత్నాలు ఎన్ని చేసినా అవకాశం రాలేదు. తాజాగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఆ అవకాశాన్ని కల్పించింది. ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు ప్రధానిని కలిశారు. నాలుగేళ్ల తర్వాత జరిగిన ఈ కలయిక రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేపుతోంది. ఈ భేటీపై టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య మాట్లాడుతూ ప్రధాని మోదీతో సమకాలీనుడైన చంద్రబాబును మోదీ చక్కగా పలకరించారని చెప్పారు. పొత్తులపై చర్చించే సందర్భం కాకపోవడంతో మళ్లీ ఢిల్లీ రావాలని కోరారన్నారు. తామెప్పుడూ బీజేపీని వ్యతిరేకించలేదని, అప్పటి ప్రభుత్వం ఏపీకి సహకారం అందించటం లేదనే విభేదించామని వివరించారు. మోదీ- బాబుల కలయిక తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త లెక్కలకు దారి తీయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
మొదటి నుంచి మద్దతే..
2014 ఎన్నికల్లో ఏపీలో ఓటమి పాలైన వైసీపీ మొదటి నుంచి కేంద్రానికి అనుకూలంగా ఉంటూ వస్తోంది. ఈ రాష్ట్రపతి ఎన్నికల్లోనే కాక అంతకు ముందుసారి కూడా బేషరతుగా మద్దతు తెలిపింది. ఏపీలోని పరిస్థితులపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ 'ఏపీలో ఒక్క సీటు కూడా లేని బీజేపీకి 175 సీట్ల బలం ఉంది' అని చేసిన వ్యాఖ్యలు నూరు శాతం వాస్తవం. కేంద్రం ఏ బిల్లు తెచ్చినా, ఎన్నికలు నిర్వహించినా ఏపీ నుంచి పూర్తి స్థాయి మద్దతు ఉండటం విశేషం. ఇక చంద్రబాబు ఢిల్లీలో మోదీని కలిసిన మరుసటి రోజే సీఎం జగన్ నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కొద్దిసేపు మోదీతో ముచ్చటించడమే కాకుండా లంచ్ చేశారు. ఎటువంటి పొత్తు లేకున్నా మొదటి నుంచి మద్దతుగా ఉంటున్న తాము(వైసీపీ) చంద్రబాబు కన్నా విశ్వసనీయమనే సంకేతాలు ఇచ్చే ఏ అవకాశాన్నీ జగన్ వదులుకోరని ప్రస్తుతం క్రియాశీలక రాజకీయాల్లో లేని ఒక మాజీ ఎంపీ చెప్పారు. జగన్ ఢిల్లీ పర్యటనపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో స్పందిస్తూ.. ప్రధానితో డిన్నర్‌కు ముగ్గురు సీఎంలకే అవకాశం ఇచ్చారని, అందులో జగన్ ఒకరని తెలిపారు. గంటకుపైగా అనేక అంశాలపై చర్చించినా.. చంద్రబాబులా ప్రచారం చేసుకోవడం లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీజేపీకి టీడీపీ, పవన్ కల్యాణ్ మద్దతిస్తారని, బదులుగా ఏపీలో సాయం చేయాలని లోపాయికారి ఒప్పందానికి చంద్రబాబు ప్రయత్నించారని ఆరోపించారు. బాబు వయసుకు తగ్గట్లు హుందాగా వ్యవహరించాలని హితవు పలికారు.
పొత్తు జనసేనతో.. కానీ ఢిల్లీకి దూరం
ప్రస్తుతం ఏపీలో బీజేపీ- జనసేన పొత్తులో ఉన్నాయి. అయితే ప్రభుత్వంపై పోరాడే ఏ కార్యక్రమాన్ని చేపట్టినా ఇరు పార్టీలు వేర్వేరుగా చేస్తున్నాయి. దీనిపై గతంలోనే పవన్ కల్యాణ్ స్పందించారు. బీజేపీ ఇచ్చే రోడ్ మ్యాప్ ఆధారంగా కలిసి పని చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఆ రకంగా అడుగులు పడిందే లేదు. ఢిల్లీలో ఆజాదీ ఉత్సవాలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఆహ్వానం అందింది. సీఎం జగన్, చంద్రబాబులతోపాటు పవన్‌ను కూడా పీఎంవో వర్గాలు ఆహ్వానించాయి. ఇటీవల వైరల్ ఫీవర్ బారిన పడిన పవన్ మాత్రం ఈసారికి ఢిల్లీ రాలేనని సమాచారం ఇచ్చారు. కౌలు రైతు భరోసా యాత్ర, జనవాణి కార్యక్రమాలను తిరిగి ప్రారంభించబోతున్న పవన్ మరోసారి ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలుస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.