కాంగ్రెస్‌తో పొత్తుకు గుడ్‌బై.. పోటీ చేసే స్థానాలను ప్రకటించిన సీపీఎం
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla Published on 2 Nov 2023 11:27 AMకాంగ్రెస్‌తో పొత్తుకు గుడ్‌బై.. పోటీ చేసే స్థానాలను ప్రకటించిన సీపీఎం
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కొందరు నాయకులు పార్టీ నుంచి టికెట్ లభించకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయా పార్టీలను వీడుతున్నారు. ఇంకొందరు నాయకులు అయితే.. అధిష్టానంపై అసహనంతో సొంత గూటికి చేరుకుంటున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్, వామపక్షాల పొత్తుపై మొదట్నుంచి సస్పెన్స్ కొనసాగూతూనే వచ్చింది. కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను తమకు కేటాయించాలని వామపక్షాలు కోరగా.. అందుకు క్లారిటీ ఇవ్వని కాంగ్రెస్ రెండు విడతల్లోనూ ఎటూ తేల్చలేదు. ఎన్నికల సమయం కూడా దగ్గర పడుతుండటంతో సీపీఎం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుకు గుడ్ బై చెప్పింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 17 స్థానాల్లో సీపీఎం పోటీ చేస్తుందని ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. రెండు మూడు రోజుల్లో అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తామని చెప్పారు. పొత్తు లేకుండా విడిగానే ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు తమ్మినేని వీరభద్రం చెప్పారు. భద్రాచలం, అశ్వారావు పేటతోపాటు ఖమ్మం జిల్లాలో 5 స్థానాలు, నల్గొండలో 3, సూర్యాపేట జిల్లాలో 2 సీట్లలో పోటీ చేయనున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్‌తో పెట్టుకోవాలని మొదట భావించామని.. అందులో భాగంగా భద్రాచలం, పాలేరు తమకు కేటాయించాలని కోరామని చెప్పారు తమ్మినేని వీరభద్రం. అయితే..వైరా, మిర్యాలగూడ టికెట్లు ఇస్తామని కాంగ్రెస్ తమతో చెప్పిందన్నారు. ఆతర్వాత వైరా స్థానం కూడా ఇచ్చేందుకు సిద్ధంగా లేమని వెల్లడించిందన్నారు. దాంతో.. కాంగ్రెస్‌తో పొత్తుపై చర్చలు జరిపామని.. ఎన్నో మెట్లు దిగి వచ్చినా ఆ స్తానాలు కేటాయించలేదన్నారు. మిర్యాలగూడతోపాటు హైదరాబాద్‌లో ఒక స్థానం ఇస్తామని ఇప్పుడు కాంగ్రెస్ చెబుతోందని అన్నారు. తమతో పొత్తు వద్దని కాంగ్రెస్ భావిస్తున్నట్లుందని తమ్మినేని అభిప్రాయపడ్డార రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయనీ.. కాంగ్రెస్ నేతల వైఖరి సీపీఎంను ఎంతో బాధించిందని చెప్పారు. కమ్యూనిస్టులకు విలువ ఇవ్వడం లేదు కాబట్టి కాంగ్రెస్‌తో సీసీఎం పొత్తు ఉండదని తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. పొత్తు లేకుండానే విడిగా పోటీ చేయాలని సీపీఎం భావిస్తోందని వెల్లడించారు. త్వరలోనే 17 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించనుంది సీపీఎం.