పార్టీ మార్పు ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన ఉత్తమ్‌

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on  20 Aug 2023 6:47 AM GMT
Congress, Uttam, Clarity,  party change,

పార్టీ మార్పు ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన ఉత్తమ్‌ 

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఓ వైపు పార్టీ అధినాయకత్వాలు అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో ఉంటే.. మరో వైపు అసంతృప్తిగా ఉన్నారంటూ పలువురు నేతలపై ప్రచారాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌లో పలువురు సీనియర్ నేతలు పార్టీపై అసహనం వ్యక్తం చేస్తున్నారని.. త్వరలోనే పార్టీ మారుతారనే ప్రచారాలు జోరు అందుకున్నాయి. అందులో ముఖ్యనేత ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి. పార్టీ మారుతారనే ప్రచారంపై ఉత్తమ్‌ ఎట్టకేలకు స్పందించారు. ఒక క్లారిటీ ఇచ్చారు.

కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ ఉత్తమ్‌ సహా ఆయన భార్య కూడా పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగింది. బీఆర్ఎస్‌లోకి గానీ.. బీజేపీలోకి గానీ వెళ్లే అవకాశాలు ఉన్నాయని పుకార్లు షికార్లు చేశాయి. ఈ నేపథ్యంలో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ తాను కాంగ్రెస్‌లోనే ఉంటానని క్లారిటీ ఇచ్చారు. తనతో పాటు తన భార్య కూడా పార్టీ మారుతారనే ప్రచారం చేస్తున్నందుకు ఉత్తమ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కాంగ్రెస్‌ను వీడే ముచ్చటే లేదని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను హుజూర్‌నగర్‌ నుంచి, తన భార్య పద్మావతి కోదాడ నుంచి పోటీ చేస్తామని స్పష్టం చేశారు ఉత్తమ్. సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలను కార్యకర్తలు, అభిమానులు నమ్మొద్దని ఈ సందర్భంగా ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి కోరారు. తనపై కొంతకాలంగా దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారని.. ఎవరు ప్రచారం చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారో తెలియడం లేదన్నారు. ఏఐసీసీ, పీసీసీ ఆమోదంతో హుజూర్‌నగర్, కోదాడ నుంచి తాను తన భార్య పోటీ చేస్తామని చెప్పుకొచ్చారు. నియోజకవర్గ ప్రజలకు తన జీవితాన్ని అంకితం చేశానని ఉత్తమ్ ఆవేదనతో చెప్పారు.

టీపీసీసీ చీఫ్‌గా ఎంపీ రేవంత్‌రెడ్డి నియామకం అయ్యాక తెలంగాణ కాంగ్రెస్‌లో అనుకోని పరిస్థితులు నెలకొంటున్నాయి. పలువురు నాయకులు రేవంత్‌ సారధ్యాన్ని విమర్శిస్తున్నారు. అధిష్టానం కొన్నిసార్లు స్పందించి సర్దిచెప్పడంతో కాస్త వెనక్కి తగ్గినా..కొన్నిసార్లు బహిరంగంగానే విమర్శించిన విషయం అందరికీ తెలిసిందే. కాంగ్రెస్‌లో మరో నాయకుడు జగ్గారెడ్డి కూడా పార్టీ మారతారని ప్రచారం జరిగింది. అయితే.. అధిష్టానం అంతా సర్దుబాటు అయ్యిందని భావించినా.. కొందరు మాత్రం ఇప్పుడే ఆట మొదలైందని అంటున్నారు. ఇంకా తెలంగాణ కాంగ్రెస్‌లో అసంతృప్తులు ఉన్నారని.. వారి సమయం వచ్చినప్పుడు బయటపడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒక్కొక్కరుగా కాంగ్రెస్‌ నాయకులు స్పందించి పార్టీ మార్పు ప్రచారం వార్తలను ఖండిస్తున్నారు. ఇంతకుముందు జగ్గారెడ్డి కూడా పార్టీ మారడంలేదని స్పష్టంగా చెప్పారు. మొత్తానికి ఇంకా పూర్తిస్థాయిలో కాంగ్రెస్‌ నాయకుల్లో అసంతృప్తి పోలేదని.. ఏ క్షణమైనా ఏదైనా జరగొచ్చని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Next Story