రేపు తెలంగాణలో ప్రచారానికి కర్ణాటక డిప్యూటీ సీఎం, ఎల్లుండి ఖర్గే

అక్టోబర్ 28వ తేదీ నుంచి నవంబర్‌ 2వ వరకు కాంగ్రెస్ రెండో విడత విజయభేరి యాత్ర కొనసాగనుంది.

By Srikanth Gundamalla  Published on  27 Oct 2023 7:45 PM IST
congress, second phase, vijayabheri yatra, telangana elections,

రేపు తెలంగాణలో ప్రచారానికి కర్ణాటక డిప్యూటీ సీఎం, ఎల్లుండి ఖర్గే

తెలంగాణలో కాంగ్రెస్‌ తరఫున ప్రచారం చేసేందుకు కర్ణాటక నుంచి నాయకులు వస్తున్నారు. శనివారం తెలంగాణలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పర్యటించనున్నారు. అలాగే ఎల్లుడి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. కాంగ్రెస్‌ విజయ బేరి యాత్ర నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ మేరకు రెండో విడత యాత్రపై షెడ్యూల్‌ విడుదల చేసింది అధిష్టానం.

కాంగ్రెస్ రెండో విడత అభ్యర్థుల జాబితా విడుదల అవుతున్న నేపథ్యంలో హైదరాబాద్ లోని తాజ్ డెక్కన్ లో కాంగ్రెస్‌ పార్టీ నేతలు సమావేశం కానున్నారు. రేపటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ మలి విడత ప్రచారం స్టార్ట్ కానుంది. దీంతో ఈ ప్రచారానికి సంబంధించిన అంశాలపై ఈ మీటింగ్ లో కాంగ్రెస్ నాయకులు చర్చించనున్నారు.

అక్టోబర్ 28వ తేదీ నుంచి నవంబర్‌ 2వ వరకు కాంగ్రెస్ రెండో విడత విజయభేరి యాత్ర కొనసాగనుంది. తాండూరు, పరిగి, చేవెళ్లతో పాటు..సంగారెడ్డి, నర్సాపూర్, మెదక్, జనగామ, ఆలేరు, భువనగిరి, నాగార్జునసాగర్, కొల్లాపూర్, కల్వకుర్తి, జడ్చర్ల, షాద్‌నగర్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్‌గిరి నియోజకవర్గాల్లో ప్రచారం కొనసాగనుంది. రేపు తాండూరు, పరిగి, చేవెళ్ల నియోజక వర్గాలలో డీకే శివకుమార్ ప్రచారం చేయనున్నారు. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు తాండూరు.. సాయంత్రం 4 నుంచి 5 వరకు పరిగి, అలాగే సాయంత్రం 6 నుంచి 7 వరకు చేవెళ్లలో డీకే శివకుమార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

ఇక, ఆదివారం తెలంగాణకు రానున్న మల్లికార్జున ఖర్గే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు సంగారెడ్డిలో కార్నర్ మీటింగ్ లో పాల్గొననున్నారు మల్లికార్జున ఖర్గే. నర్సాపూర్‌లో సాయంత్రం 4 గంటలకు కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు. పాదయాత్రలు, కార్నర్ మీటింగ్‌లతో జాతీయ నాయకులతో పాటు, రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ప్రచారంలో పాల్గొంటారు. చివరగా సాయంత్రం ఆరు గంటలకు మెదక్‌లో ఖర్గే పాదయాత్ర చేయనున్నారు. బీఆర్ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించడంతో పాటు.. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఏం చేయనుందనే విషయాలను వివరించనున్నారు. అయితే, కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేస్తుండటంతో గులాబీ పార్టీకి కౌంటర్ ఇచ్చేందుకు కర్ణాటకకు చెందిన మల్లికార్జున ఖర్గే, డీకే శివకుమార్‌ల తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Next Story