షర్మిలకు ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌ పదవిపై మాజీ ఎంపీ కీలక వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిని వైఎస్‌ షర్మిలకు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది.

By Srikanth Gundamalla  Published on  11 Jan 2024 3:00 PM GMT
congress, harsha kumar,  sharmila,

షర్మిలకు ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌ పదవిపై మాజీ ఎంపీ కీలక వ్యాఖ్యలు 

తెలంగాణలో పార్టీని స్థాపించి వైఎస్సార్‌ పాలన తీసుకొస్తానని చెప్పిన షర్మిల.. రాజకీయ పరిణామాల నేపథ్యంలో తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసింది. ఆమె కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించింది. అయితే.. ఏపీలో రానున్న రోజుల్లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఓ వార్త హల్‌చల్‌ చేసింది. త్వరలోనే ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిని వైఎస్‌ షర్మిలకు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై కాంగ్రెస్‌ సీనియర్ నేత, మాజీ ఎంపీ హర్షకుమార్‌ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ఒక రాష్ట్రంలో చెల్లని నాణెం మరో రాష్ట్రంలో ఎలా చెల్లుందని హర్షకుమార్ ప్రశ్నించారు. ఆమెకు పీసీసీ పదవి ఇస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని అన్నారు. ఏపీలో కాంగ్రెస్‌ను బ్రతికించే నాయకులే లేరా అంటూ హర్షకుమార్‌ ప్రశ్నించారు. షర్మిలకు పీసీసీ పదవి ఇవ్వడం కాంగ్రెస్‌ నాయకులు ఎవరూ ఆమోదించలేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో లీడర్‌షిప్‌ కావాలనుకున్న షర్మిలను తీసుకొచ్చి ఏపీలో పెడితే ఇక్కడి వారి ఆత్మాభిమానం దెబ్బతుంటుందని చెప్పారు. షర్మిల అన్న వైఎస్‌ జగన్‌.. ఇద్దరూ ఒకటే అని వ్యాఖ్యానించారు హర్షకుమార్. జగన్‌ను కానీ.. వైఎస్ షర్మిలను కానీ ఏపీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేవన్నారు. ఢిల్లీలో తాను మోదీని చూసుకుంటాననీ.. సోనియాను చూసుకోవాలంటూ షర్మిలకు జగన్‌ చెప్పారనీ.. ఆమేరకు శిక్షణ ఇచ్చి ఢిల్లీకి పంపి కాంగ్రెస్‌లో చేర్పించారని ఆరోపించారు. ఇక కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా సేఫ్‌గా ఉండొచ్చనే జగన్‌ ఇలా ప్లాన్ చేశారంటూ హర్షకుమార్ విమర్శలు చేశారు.


Next Story