తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బెంగళూరు చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా పద్మనాభ నగర్‌లో ఉన్న మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడ నివాసానికి వెళ్లారు. అక్కడ దేవెగౌడ తో పాటు ఆయన తనయుడు మాజీ సీఎం కుమార స్వామి సీఎం కేసీఆర్‌కు స్వాగతం పలికారు. అనంతరం వారితో కలిసి కేసీఆర్ మధ్యాహ్నా భోజనం చేశారు.
ఆతరువాత దేవెగౌడ, మాజీ సీఎం కుమార స్వామితో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిణామాలు, జాతీయ రాజకీయాలు, రాష్ట్రాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంతో పాటు భవిష్యత్ కార్యాచరణ, రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా విపక్షాల ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే అంశం వంటి వాటిపై దేవెగౌడ, కుమారస్వామితో సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. కేసీఆర్ పర్యటన సందర్భంగా అభిమానులు బెంగళూరులోని ప్రధాన కూడళ్లలో కటౌట్లు, ఫెక్సీలు ఏర్పాటు చేశారు. కేసీఆర్ వెంట రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, జీవన్ రెడ్డి ఉన్నారు.
సమావేశం అనంతరం సాయంత్రం 4 గంటలకు బెంగళూరు నుంచి తిరిగి హైదరాబాద్‌కు రానున్నారు.