మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుతో సీఎం కేసీఆర్ అత్యవసర భేటీ

ప్రగతి భవన్‌లో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యవసరంగా సమావేశం అయ్యారు.

By Srikanth Gundamalla  Published on  12 Oct 2023 6:18 AM GMT
CM KCR, Meeting,   ktr, harish rao, pragathi bhavan,

 మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుతో సీఎం కేసీఆర్ అత్యవసర భేటీ

ప్రగతి భవన్‌లో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యవసరంగా సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఎన్నికల మేనిఫెస్టో, ఎన్నికల ప్రచారంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 30వ తేదీనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఎక్కువ సమయం లేనందున ప్రచారం జోరుగా నిర్వహించాలని భావిస్తున్నారు బీఆర్ఎస్‌ అగ్రనేతలు. అలాగే ఈ సారి కూడా విజయం సాధించి ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని.. హ్యాట్రిక్ కొట్టాలని పట్టుదలతో ఉన్నారు.

అయితే.. ఇప్పటికే సీఎం కేసీఆర్ ఇతర పార్టీల కంటే ముందే ఉన్నారు. ఇప్పుడే కాదు.. గత ఎన్నికల్లోనూ ప్రతిపక్ష పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించారు. ఈసారి కూడా అదే జరిగింది. అయితే.. మరో నాలుగు అసెంబ్లీ స్థానాలను మాత్రం పెండింగ్‌లో ఉంచారు. ఈ స్థానాలకూ అభ్యర్థులను ఈ సమావేశం తర్వాత ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇక మరోవైపు సీఎం కేసీఆర్‌ కొద్డిరోజుల వైరల్ ఫీవర్‌తో బాధపడ్డారు. ఇప్పుడు అనారోగ్యం నుంచి ఆయన పూర్తిగా కోలుకున్నారు. దాంతో.. ఎన్నికల ప్రచారం సహా.. పార్టీలో అన్ని అంశాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తున్నారు. అంతేకాదు.. ఈ నెల 15వ తేదీ నుంచి కేసీఆర్‌ నేరుగా ఎన్నికల ప్రచారంలోకి దిగున్న విషయం తెలిసిందే. 17 రోజుల్లో 41 నియోజకవర్గాల్లో ప్రచారాన్ని నిర్వహించేలా షెడ్యూల్ చేసుకున్నారు. మరోవైపు ఇప్పటికే కేటీఆర్, హరీశ్‌రావు సహా ఇతర ముఖ్య నేతలంతా సభలతో హోరెత్తిస్తున్నారు.

సీఎం కేసీఆర్ పెండింగ్‌లో పెట్టిన అసెంబ్లీ స్థానాలకు కూడా అభ్యర్థులు దాదాపు ఖరారు అయ్యారు. ఆయా నియోజకవర్గాల్లో అసంతృప్తులను బుజ్జగించి బీఆర్ఎస్‌ గెలుపునకు కృషి చేసేలా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక తరువాయి అభ్యర్థుల పేర్లు ప్రకటించడమే మిగిలి ఉంది. పెండింగ్‌లో ఉన్న జనగామ నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నర్సాపూర్‌ అసెంబ్లీ స్థానం నుంచి సునీతా లక్ష్మారెడ్డి, నాంపల్లి స్థానం నుంచి ఆనంద్‌గౌడ్, గోషామహల్ నుంచి గోవింద్‌ రాటే పేర్లు ప్రకటించే చాన్స్‌ ఉంది. ఇక మల్కాజిగిరి నుంచి బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేయాల్సిన మైనంపల్లి పార్టీ మారడంతో ఆ స్థానానికి కూడా అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. ఈ క్రమంలో మల్కాజిగిరి నుంచి మర్రి రాజశేకర్‌రెడ్డి పేరును ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Next Story