రేపు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం.. కేసీఆర్ టార్గెట్ వారే.!
ఈ నెల 17న మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్‌ఎస్ శాసనసభా పక్షం, పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. తెలంగాణ భవన్‌లో
By అంజి Published on 16 May 2023 3:15 AM GMTరేపు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం.. కేసీఆర్ టార్గెట్ వారే.!
హైదరాబాద్: ఈ నెల 17న మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్‌ఎస్ శాసనసభా పక్షం, పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ పాల్గొనాలని పత్రికా ప్రకటనలో కోరారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుత విజయం సాధించడంతోపాటు మరో ఐదు నెలల్లో తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.
జూన్ 2న బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకోనుండగా, డిసెంబరులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ సమావేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 27న జరిగిన సభలో ‘అవినీతి’, ‘పనిచేయని’ ఎమ్మెల్యేలు తమ తాము సరిదిద్దుకోవాలని, లేకుంటే వారికి సీట్లు ఇవ్వమని సీఎం ఇప్పటికే హెచ్చరించారు. దళిత బంధు పథకం కింద రూ.10 లక్షల లబ్ధి చేకూర్చేందుకు ఒక్కో లబ్ధిదారుడి నుంచి రూ.3 లక్షల వరకు దోపిడీ చేస్తున్న ఎమ్మెల్యేల జాబితా తన వద్ద ఉందని సీఎం స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు.
ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే పార్టీ నుంచి బయటకు పంపిస్తామని హెచ్చరించారు. రేపటి సమావేశంలో అభ్యర్థులందరికీ మరింత క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరో రెండు వారాల్లో ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించడంతో ఎమ్మెల్యేలు తమ రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు. 30 మంది అవినీతి, పని చేయని ఎమ్మెల్యేల పేర్లతో సహా పలు జాబితాలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రచారం చేయడంతో ఎమ్మెల్యేలలో ఆందోళన నెలకొంది.
జూన్ 2వ తేదీ నుంచి 21 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని సీఎం నిర్ణయించారు, ఈ సమావేశంలో పార్టీ ప్రచార కార్యక్రమాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.