భవిష్యత్‌కు గ్యారెంటీ ఇచ్చేలా చంద్రబాబు యాక్షన్ ప్లాన్

చంద్రబాబు టీడీపీ పార్టీ శ్రేణులను ఎన్నికల దిశగా సన్నద్ధం చేయడంపై ఫోకస్ పెట్టారు.

By Srikanth Gundamalla  Published on  20 July 2023 1:09 PM GMT
Chandrababu, TDP, Election, Action Plan,

భవిష్యత్‌కు గ్యారెంటీ ఇచ్చేలా చంద్రబాబు యాక్షన్ ప్లాన్

ఏపీలో ఎన్నికలకు ఇంకా ఏడాది మిగిలే ఉంది. కానీ.. ఎన్నికల కోసం పార్టీలు ఇప్పటి నుంచే సన్నద్ధం అవుతున్నాయి. ప్రజలను ఆకర్షించేందుకు వివిధ కార్యక్రమాలను చేపడుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఈసారి వైసీపీకి కోలుకోలేని దెబ్బ కొట్టాలని ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం వివిధ కార్యక్రమాలను చేపడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు. ఇప్పటికే మేనిఫెస్టోలోని కొన్ని అంశాలను ప్రజల్లోకి వదిలి.. సమరశంఖం పూరించారు.

తాజాగా.. చంద్రబాబు టీడీపీ పార్టీ శ్రేణులను ఎన్నికల దిశగా సన్నద్ధం చేయడంపై ఫోకస్ పెట్టారు. టీడీపీలోని దాదాపు 15 మంది ముఖ్యనేతలతో చంద్రబాబు దాదాపు 3 గంటల పాటు సమావేశం అయ్యారు. ప్రధానంగా పార్టీలోని వివిధ స్థాయిలకు చెందిన నేతలు, కార్యకర్తలను దృష్టిలో ఉంచుకునే ఈ భేటీ సాగింది. ఇదివరకే ప్రజల కోసం భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో శక్తివంతమైన మేనిఫెస్టోను చంద్రబాబు రూపొందించారు. ఇప్పుడు పార్టీలోని కార్యకర్తలు, నేతల భవిష్యత్తుకు గ్యారెంటీ ఇచ్చేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. దీనిపైనే చంద్రబాబు పార్టీ ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.

బూత్ స్థాయి నుంచి వివిధ దశల ఇన్చార్జిలకు ఎప్పటికప్పుడు యాక్షన్ ప్లాన్ ఇచ్చేలా కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్టు చంద్రబాబు వెల్లడించారు. ఏ స్థాయిలో ఉన్న లోపాలను ఆ స్థాయిలోనే సరిదిద్దుకోవాలని చెప్పారు. ఇంచార్జ్‌లు, కార్యకర్తల పనితీరును విశ్లేషించడానికి 10 మంది సభ్యులతో కూడిన స్పెషల్‌ కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఇలా ప్రతి నియోజకవర్గానికి ఒక కమిటీ ఉంటుంది. కమిటీలు యాక్షన్ ప్లాన్ రూపొందించడం తోపాటు, వాటి అమలుపై ప్రతి నెలా నివేదికలు రూపొందించి పార్టీ హైకమాండ్ కు అందిస్తాయని చంద్రబబు తెలిపారు.

ప్రతి ఒక్కరూ వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని చంద్రబాబు సూచిచంఆరు. ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఓట్ల రూపంలోకి మార్చడమే ప్రధాన అజెండా అని వివరించారు. కష్టపడి పనిచేసే నేతలకు పార్టీ గుర్తించేందుకే తాజా కార్యాచరణ రూపకల్పన చేసినట్లు చెప్పారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రతి ఒక్కరిపై సర్వేలు నిర్వహిస్తామని.. దాని ఆధారంగానే పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.


Next Story