కుప్పంలో లక్ష మెజారిటీనే లక్ష్యం: చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 28 Dec 2023 8:16 PM ISTకుప్పంలో లక్ష మెజారిటీనే లక్ష్యం: చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా గుడిపల్లెలో ఏర్పాటు చేసిన రోడ్‌షోలో పాల్గొన్నారు. అక్కడ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. తాను ఎప్పుడు వచ్చిన గుడిపల్లె ప్రజలు ఎంతో ఆదరిస్తున్నారని చంద్రబాబు అన్నారు. కుప్పం తన సొంత గడ్డ వంటిందనీ.. కుప్పంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా తాను ముందుంటానని అన్నారు. కుప్పం ప్రజలనంతా తన కుటుంబంగానే భావిస్తానని చెప్పారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల గురించి ప్రస్తావించిన చంద్రబాబు.. ఈ సారి ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడం పక్కా అన్నారు. కుప్పంలో తనకు లక్ష ఓట్ల మెజార్టీ రానుందని దీమా వ్యక్తం చేశారు. తాము లక్ష ఓట్ల మెజారిటీనే లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. తనకు లక్ష మెజారిటీ రావాలంటే.. గుండెకాయ వంటి గుడిపల్లెలో మొత్తం ఓట్లన్నీ టీడీపీకే పడాలని పిలుపునిచ్చారు. సీఎం అవ్వాలనీ.. లేదంటే ఎమ్మెల్యే అని పిలుపు కోసమో తనకు ఓట్లు వేయాలని అడగడం లేదన్నారు చంద్రబాబు. వైసీపీ అరాచకాలు, ఆ ప్రభుత్వం అహంకారానికి, నియంతృత్వానికి చరమగీతం పాడాలనేది తన లక్ష్యమన్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్న తనకే వైసీపీ పాలనలో రక్షణ లేకుండా పోయిందన్నారు. మరి సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో మీరే అర్థం చేసుకోవాలన్నారు చంద్రబాబు.
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ సినిమా అయిపోయిందనీ.. మరో వంద రోజులే వారికి మిగిలి ఉన్నాయని అన్నారు. ఇప్పటికే వైసీపీ 100 తప్పులు చేసిందనీ.. తాము ప్రభుత్వంలోకి వచ్చాక వైసీపీ అవినీతి మొత్తం కక్కిస్తామని చంద్రబాబు అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజలు కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఎన్నికల సంఘం కూడా రాష్ట్రంలో ఇప్పటికే క్రియాశీలకం అయ్యిందన్నారు. ఇక జరిగే కార్యక్రమాలన్నీ ఎన్నికల సంఘం పర్యవేక్షణలోనే జరుగుతాయని చెప్పారు. తమ మేనిఫెస్టోలో భాగంగా ఆడబిడ్డలకు నెలకు రూ.1500 ఇస్తామనీ.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక మూడు గ్యాస్ సిలిండర్లను కూడా ఫ్రీగా ఇస్తామని చెప్పారు టీడీపీ అధినేత చంద్రబాబు.