చంద్రబాబు అరెస్ట్‌పై ఎందుకు మాట్లాడలేదో ఎన్టీఆర్‌నే అడగండి: అచ్చెన్నాయుడు
చంద్రబాబు అరెస్ట్ గురించి ఎన్టీఆర్ స్పందించకపోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
By Srikanth Gundamalla Published on 15 Sept 2023 4:15 PM ISTచంద్రబాబు అరెస్ట్‌పై ఎందుకు మాట్లాడలేదో ఎన్టీఆర్‌నే అడగండి: అచ్చెన్నాయుడు
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపర్చగా.. ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో రిమాండ్‌లో ఉన్నారు. ఆయన్ని బయటకు తీసుకొచ్చేందుకు చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోర్టులో పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. అయితే.. చంద్రబాబు అరెస్ట్.. జైల్‌లో ఉంచడంపై ఏపీలోనే కాదు.. తెలంగాణలోనూ టీడీపీ శ్రేణులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న నాయకులు పలువురు చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించారు. అయితే.. హీరో జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు అరెస్ట్ గురించి ఇప్పటి వరకు స్పందించకపోవడంపై సోషల్ మీడియాలో.. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మీడియా సమావేశంలో మాట్లాడుతుండగా.. జర్నలిస్టులు ఇదే అంశాన్ని ప్రస్తావించారు. దానికి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్ట్‌పై జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదో ఆయన్నే అడగాలని.. పోయి ఆయన్ని అడిగితేనే సమాధానం దొరుకుతుందని అచ్చెన్నాయుడు సమాధానం ఇచ్చారు. తనని అడిగితే ఏం చెప్పలగనని అన్నారు. స్పందించాలని తాము కూడా ఎవరినీ అడగమని చెప్పారు. జనసేనతో పొత్తుపై స్పందించిన అచ్చెన్నాయుడు.. రాబోయే రోజుల్లో జనసేనతో కలిసి కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు. చంద్రబాబు అరెస్ట్‌ను జనసేన నేతలు, కార్యకర్తలు ఖండిస్తున్నారని చెప్పారు. టీడీపీ చేపట్టిన దీక్షల్లో జనసేన నాయకులు, పార్టీ శ్రేణులు స్వచ్ఛంగా పాల్గొంటున్నారని అచ్చెన్నాయుడు చెప్పారు.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయని అచ్చెన్నాయుడు అన్నారు. తెలుగు ప్రజలంతా చంద్రబాబుకి అండగా ఉన్నారన్నారు. ఆయన జీవితంలో ఎక్కడా అవినీతి మచ్చ లేదన్నారు. కేబినెట్ ఆమోదంతోనే స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటైందని.. యువతకు ఉద్యోగాలిప్పిస్తే తప్పు పడతారా అంటూ ఏపీ ప్రభుత్వంపై అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.