ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల్లో తీవ్ర ఉత్కంఠ రేపింది నందిగ్రామ్. మొదట ఈ స్థానంలో ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ గెలిచిన‌ట్లు వార్తలు వచ్చేశాయి. చివ‌రికి ఇక్క‌డ బీజేపీ అభ్య‌ర్థి సువేందు అధికారి గెలిచిన‌ట్లు ప్రకటన వచ్చింది. మొద‌ట 1200 ఓట్ల‌తో ఇక్క‌డ మ‌మ‌త గెలిచిన‌ట్లుగా మీడియా అంతా ప్ర‌చారం చేసినప్పటికీ సువేందు 1,736పైగా ఓట్లతో గెలుపొందారని ఈసీ తెలిపింది. ఓట్ల లెక్కింపులో ఏర్పడిన గందరగోళం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది.

సువేందు గెలుపును బీజేపీ నేత అమిత్ మాలవ్య ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మమతా బెనర్జీ కూడా స్వయంగా ఈ ఓటమిని అంగీకరించారు. నందిగ్రామ్ లో ఓట‌మి గురించి చింతించ‌వ‌ద్దని అన్నారు. ఒక్క సీటుతో వచ్చేదేమీ ఉండదు.. పోయేదేమీ ఉండదని అన్నారు. నందిగ్రామ్ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌర‌విస్తానని అన్నారు. నందిగ్రామ్‌లో ఏం జరిగిందో మరిచిపోండి. మనం బెంగాల్‌ను గెలిచాం.. అంటూ మమత చెప్పుకొచ్చారు. అయితే నందిగ్రామ్ ఫలితంపై కోర్టుకు వెళ్తానని మమతా బెనర్జీ ప్రకటించడం కూడా జరిగింది.

ఇక మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పీఠంపై మరోసారి కూర్చోవడం ఖాయమే..! అయితే బెంగాల్‌లో శాసనమండలి లేకపోవడంతో సీఎంగా కొనసాగాలంటే మాత్రం ఆమె ఆరు నెలల లోపు ఎమ్మెల్యేగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమె ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారో అనే ఉత్కంఠ మొదలైంది. సాధారణంగా ఎవరైనా నాయకులు రాజీనామా చేసి.. అధినేత్రిని నిలబడమని కోరేవారు. ఎందుకంటే గతంలో చాలా రాష్ట్రాల్లో ఇలాంటిది జరిగింది.

అయితే పశ్చిమ బెంగాల్ లో మాత్రం పోటీలో నిలిచిన అభ్యర్థులు మరణించడంతో రాష్ట్రంలో మూడు చోట్ల ఎన్నికలు జరగాల్సి ఉంది. ఉత్తర 24 పరగాల జిల్లాలోని ఖర్దాహా స్థానానికి గత నెల 22న పోలింగ్ జరిగింది. ఆ స్థానం నుంచి బరిలోకి దిగిన టీఎంసీ అభ్యర్థి కాజల్ సిన్హా గెలుపొందారు. కరోనా బారినపడిన ఆయన ఏప్రిల్ 25న మృతి చెందారు.జంగీపూర్ ఆర్ఎస్‌పీ అభ్యర్థి, శంషేర్‌గంజ్ కాంగ్రెస్ అభ్యర్థి మృతి చెందడంతో ఆ రెండు చోట్లా ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇక మూడు చోట్ల ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఈ మూడు చోట్లలో ఏదో ఒక స్థానాన్ని మమత ఎంచుకోవాల్సి ఉంటుంది. మమతా ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తారో అనే ఉత్కంఠ మొదలైంది. నందిగ్రామ్ ఫలితంపై కోర్టుకు వెళ్లనున్న మమతా బెనర్జీకి కోర్టు గుడ్ న్యూస్ ఏమైనా చెబుతుందా అనేది కూడా ఆసక్తి కలిగించే అంశమే..!


సామ్రాట్

Next Story