హుజూరాబాద్ లో సైలెంట్ గా పని కానిచ్చేస్తున్న బీజేపీ

BJP working silently in Huzurabad.హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయం సాధించడానికి బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ లు

By M.S.R  Published on  29 Oct 2021 12:38 PM GMT
హుజూరాబాద్ లో సైలెంట్ గా పని కానిచ్చేస్తున్న బీజేపీ

హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయం సాధించడానికి బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ లు తమ ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ ను గెలిపించడానికి ఆ పార్టీ ఇప్పటికే తమ వంతు ప్రయత్నాలను చేస్తోంది. ఈటలను గెలిపించడానికి సంఘ్ పరివార్ రంగంలోకి దిగిందట..!

చాలా కొద్ది మంది బీజేపీ నాయకులకు మాత్రమే తెలిసిన వాలంటీర్లతో కూడిన రహస్య సేనలను దింపారట..! 'నరేంద్ర మోదీ కోసం పని చేసే నిపుణులుగా వీరిని చెబుతూ ఉంటారు'. ఇందులో పలు రంగాలకు చెందిన వ్యక్తులు ఉంటారు. ముఖ్యంగా టెక్కీలు, వైద్యులు, చార్టెడ్ అకౌంటెంట్లు, లాయర్లు మొదలైనవారు ఉంటారు. ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి ఆదేశాలు తీసుకుని ఎన్నికల్లో బీజేపీ విజయానికి కృషి చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కార్యక్రమాలకు మద్దతుని తీసుకుని రావడానికి.. ప్రత్యేకంగా బీజేపీకి వారందరూ చాలా కట్టుబడి ఉంటారు. అభ్యర్థితో సంబంధం లేకుండా వారు ఎన్నికలలో బీజేపీకి ప్రచారం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. అయితే హుజూరాబాద్ లో ఆసక్తికరంగా వారు ప్రచారంలో ప్రధానమైన హిందుత్వ అంశాన్ని తీసుకుని రాలేదు. లోక్‌సభ ఎన్నికల తర్వాత 2019లో ఏర్పడిన ఈ బృందాలు(ప్రోనమో అంటారు) పెద్ద శక్తిగా రూపుదిద్దుకుంది. మోదీ అభిమానుల సంఘంగా ఏర్పాటైనప్పటికీ, ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో కూడా తన సభ్యులను మోహరించగలుగుతోంది. దుబ్బాక ఉపఎన్నికల ప్రచారంలోకి తొలిసారి పెద్దఎత్తున దిగారని తెలుస్తోంది.

వీరు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ పనిచేశారు. అయితే కోవిడ్-19 ఆంక్షల కారణంగా నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై దృష్టి సారించలేకపోయారు. ఇప్పుడు ప్రోనమో టీమ్‌లు హుజూరాబాద్ నియోజకవర్గంలో చక్రం తిప్పుతున్నాయట. హుజూరాబాద్‌లో వారాంతాల్లో 100 నుంచి 150 మంది ప్రోనమో సభ్యులు బీజేపీతో సమన్వయం లేకుండా సొంతంగా ప్రచారం నిర్వహించారు. వారాంతాల్లో ఎక్కువగా ప్రచారం చేశారు. ప్రతి వారాంతంలో దాదాపు 40 నుంచి 50 మంది నిపుణులు తమ సొంత ఖర్చులతో ఇద్దరు లేదా ముగ్గురు గ్రూపులుగా గ్రామాల్లో పర్యటిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది హైదరాబాద్ నుంచి రాగా.. మరికొందరు ఇంటి నుంచే పనిచేస్తున్నందున పక్క పట్టణాల నుంచి ప్రచారంలో పాల్గొన్నారు.

''మేం ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నాం. కుటుంబ సభ్యులతో కూర్చుని బీజేపీకి ఓటు వేయాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తున్నాం. కేంద్ర నిధులను రాష్ట్ర కార్యక్రమాలకు మళ్లిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తమ కార్యక్రమాలను ఎలా ప్రచారం చేసుకుంటుందో వారికి వివరిస్తున్నాం. రాష్ట్రం యువతను, విద్యార్థులను ఎలా దూరం చేసిందో ఉదాహరణలతో చూపించాం. రాష్ట్రంలో అవినీతి ఎంత లోతుగా విస్తరించిందో కూడా వారికి తెలియజేస్తున్నాం. మేం పార్టీ క్యాడర్‌ కాదని వారికి కూడా చెబుతున్నాం. మేము బాగా చదువుకున్న, అధిక వేతనాలు అందుకుంటూ ఉంటామని.. కేవలం వాలంటీర్లమని మేము వారికి చెబుతున్నాము, ప్రధాని మోదీని మరింత బలోపేతం చేయడానికి మా స్వంత సంకల్పంతో పనిచేస్తున్నాము" అని తన పేరు గోప్యంగా ఉంచిన ఓ వ్యక్తి తెలిపారు. తాము భారతీయ జనతా పార్టీ నుండి ఎటువంటి సహాయం తీసుకోమని వెల్లడించారు. "మా సభ్యులు ఆహారం మరియు ఉండడం కోసం వారి స్వంత ఏర్పాట్లు చేసుకుంటారు. ఆహారం దొరకని మారుమూల ప్రాంతాల్లో ఉన్నప్పుడే స్థానిక బీజేపీ నేతలను సంప్రదిస్తాం. లేకుంటే మాది సొంత ప్రచారమే'' అన్నారు.

హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ నిపుణుడు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రోనమో బృందాలు హుజూరాబాద్, జమ్మికుంట, కమలాపూర్, వీణవనక, ఇల్లెందుకుంట, ఉప్పల్ ఏరియాలను కవర్ చేసి 10,000 మందికి పైగా ఓటర్లను కలుసుకున్నాయి. ప్రోనమో కార్యనిర్వహణ విధానం గురించి హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది చంద్రశేఖర్ మాట్లాడుతూ, "మా ప్రచారం ఎక్కువగా వ్యక్తులతో పరస్పర చర్యలో నిర్వహించబడుతుంది. మేము ఎప్పుడూ రాజకీయ బురదజల్లాలని భావించము." అని తెలిపారు. దుబ్బాక ప్రచారంలో చురుగ్గా పాల్గొన్న చంద్రశేఖర్ ఇతర పనుల వల్ల హుజూరాబాద్‌కు వెళ్లలేక బృందాన్ని సమన్వయం చేస్తూ సహకరించారు. నియోజక వర్గంలోని సగభాగంలో ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో రెండుసార్లు దుబ్బాకలో ప్రోనమో బృందం ప్రచారం నిర్వహించిందన్నారు.

"మేము మాతో పాటు ఏ స్థానిక నాయకుడిని తీసుకుని వెళ్లలేదు. మేం జీతాలు తీసుకునేవాళ్లం కాదని ఓటర్లకు వివరించాము. మేము భారీ జీతాలతో సాఫ్ట్‌వేర్ మరియు ఇతర నిపుణులుగా పని చేస్తున్నాము. ప్రజలు మమ్మల్ని సిన్సియర్‌గా నమ్మారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లు, ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాలు లేకపోవడం, మహిళలు-బీడీ కార్మికుల ఆరోగ్య సమస్యలు తదితర స్థానిక సమస్యలు, తుంగలో తొక్కిన వాగ్దానాల గురించి మాట్లాడి, వారికి అందుతున్న వృద్ధాప్య పింఛన్ల మూలాలను ఓటర్లకు వివరించాము. పింఛన్‌లో 90 శాతం ప్రధాని మోదీ నిధుల ద్వారానే అందజేస్తున్నామని వారికి చెప్పాం'' అని వివరించారు.

''టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల ఉల్లంఘన గురించి చెప్పగానే ప్రజల్లో నమ్మకం కలిగింది. ప్రభుత్వం లక్ష ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి గురించి యువతకు చెప్పాం, వారు మాతో ఏకీభవించారు. యువత మరియు రాజకీయేతరులు నిర్వహిస్తున్న ప్రచారం కావడంతో ఇది స్థానిక ప్రజలలో బాగా పోయింది" అని బృందం సభ్యులు చెప్పారు. ప్రోనమో(ProNamo) లో 800 నుండి 1000 మంది వాలంటీర్లు ఉన్నారు, వారు ఎక్కువగా ఆన్‌లైన్‌లో ఇంటరాక్ట్ అవుతున్నారు. తమ సభ్యులు అనేక స్వచ్ఛంద కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నారని ఈ బృందం తెలిపింది.

Next Story