ఎవరిష్టం వారిది కానీ నిందలు సరికాదు.. రాజగోపాల్ రాజీనామాపై బీజేపీ రియాక్షన్
బీజేపీకి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాపై ఆ పార్టీ నాయకులు స్పందించారు.
By Srikanth Gundamalla Published on 25 Oct 2023 9:45 AM GMTఎవరిష్టం వారిది కానీ నిందలు సరికాదు.. రాజగోపాల్‌రెడ్డి రాజీనామాపై బీజేపీ రియాక్షన్
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. ముందుగా చెప్పినట్లుగానే ఆయన కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు ప్రకటించారు. అయితే.. అనుచరుల విన్నపం మేరకు తాను బీజేపీ వీడి కాంగ్రెస్ నుంచి పోటీ చేయనున్నట్లు రాజగోపాల్‌రెడ్డి వెల్లడించారు. ఈక్రమంలో రాజగోపాల్‌రెడ్డి రాజీనామాపై ఆ పార్టీ నాయకులు స్పందించారు. రాజీనామా విషయంలో ఎవరి ఇష్టం వారిదంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కామెంట్ చేశారు. అయితే.. బీఆర్ఎస్‌కు తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయం కాదంటూ రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మాత్రం ఖండిస్తున్నట్లు చెప్పారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. వారు అనుకున్నంత మాత్రాన సరిపోదని రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని కిషన్‌రెడ్డి అన్నారు. రాజగోపాల్ రెడ్డికి పార్టీ మంచి అవకాశం ఇచ్చిందని, జాతీయ స్థాయిలో పదవి కట్టబెట్టామని కిషన్ రెడ్డి చెప్పారు. అయినా పార్టీ మారడం ఆయన వ్యక్తిగత నిర్ణయమని అన్నారు. అయితే, వ్యక్తిగత కారణాలతో పార్టీకి రాజీనామా చేస్తూ ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు కిషన్‌రెడ్డి. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు బీజేపీ ప్రత్యామ్నాయం కాబోదని రాజగోపాల్ రెడ్డి అన్నారు. బీజేపీకి రాజీనామా చేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిని కిషన్ రెడ్డి తప్పుబట్టారు. బీజేపీ పోటీలో లేదని వారు అనుకుంటే సరిపోతుందా అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనకు చెక్ పెట్టేది తామేనని.. అధికారంలోకి కూడా వస్తామని కిషన్‌రెడ్డి దీమా వ్యక్తం చేశారు.
రాజగోపాల్‌రెడ్డికి బీజేపీ మంచి అవకాశాలు కల్పించామని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు ఎంతో కష్టపడుతున్నారని.. అలాంటప్పుడు వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసి పార్టీని విమర్శించడం సరికాదని సూచించారు. ఇక దేశంలో మూడోసారి మోదీ ప్రభుత్వమే రానుందని చెప్పారు. జనసేన, బీజేపీ ఈసారి ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని లక్ష్మణ్ వెల్లడించారు. రాజగోపాల్‌రెడ్డి రాజీనామాపై మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి స్పందించారు. ఆయన్ను పాసింగ్ క్లౌడ్‌గా అభివర్ణించారు. వచ్చివెళ్లిపోయే వారు చాలా మందే ఉంటారని.. కానీ పార్టీ ఎప్పుడూ బలంగానే ఉంటుందని జితేందర్ రెడ్డి అన్నారు.
ఇక బీజేపీని వీడిన రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఒకట్రెండు రోజుల్లో సొంత పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా మనుగోడు నుంచి బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయని కొందరు అంటున్నారు.