నేడు తెలంగాణకు రానున్న జేపీ నడ్డా.. హీరో నితిన్, మాజీ క్రికెటర్ మిథాలీరాజ్‌తో భేటీ
BJP President JP Nadda to meet Nitin and Mithali Raj.తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది.
By తోట వంశీ కుమార్ Published on 27 Aug 2022 8:54 AM ISTతెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అడుగులు వేస్తోంది. ఆ దిశగా కార్యాచరణ సిద్దం చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు. తాజాగా హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో నిర్వహించనున్న ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు వస్తున్న బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. టాలీవుడ్ హీరో నితిన్ తో పాటు భారత మాజీ మహిళా క్రికెటర్ మిథాలీరాజ్‌తో సమావేశం కానుండడం చర్చనీయాంశంగా మారింది.
ఈ రోజు ఉదయం 11.45 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి జేపీ నడ్డా చేరుకుంటారు. అక్కడ నుంచి ఆయన నోవాటెట్ హోటల్ కు వెళ్లనున్నారు. మధ్యాహ్నాం 12 గంటలకు మిథాలీ రాజ్‌తో భేటీ కానున్నారు. అనంతరం బీజేపీ నాయకులతో సమావేశం కానున్నారు. తాజా రాజకీయ పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలపై చర్చిచనున్నారు. ఆ తరువాత ప్రత్యేక హెలికాఫ్టర్‌లో వరంగల్‌కు చేరుకోనున్నారు. మధ్యాహ్నాం 3 గంటల నుంచి 3.15 గంటల వరకు వరంగల్ భద్రకాళీ అమ్మవారిని దర్శించుకుంటారు. సాయంత్రం 4.10 నుంచి 5.40 వరకు పాదయాత్ర ముగింపు సభలో పాల్గొంటారు. సాయంత్రం 5.55కు వరంగల్ నుంచి శంషాబాద్ నోవాటెల్‌కు చేరుకుంటారు. రాత్రి 7 గంటలకు హీరో నితిన్‌తో భేటీ కానున్నారు. అనంతరం ఢిల్లీకి తిరుగుప్రయాణం కానున్నారు.
నితిన్‌తో భేటికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. తెలంగాణ ప్రాంతానికి చెందిన నితిన్‌ను రాజకీయాల్లోకి రావాలని జేపీ నడ్డా ఆహ్వానించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. కాగా.. ఇటీవల మునుగోడు సభలో పాల్గొనేందుకు వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా నోవాటెల్ హోటల్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సమావేశమైన సంగతి తెలిసిందే. ఇలా బీజేపీ అగ్రనేతలు వరుసగా తెలుగు హీరోలను కలవనుండటం ఇప్పుడు తెలంగాణ అంతటా హాట్ టాపిక్ గా మారింది.