బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు మొదలైన కసరత్తు
బీజేపీ జాతీయ అధ్యక్షుడిని మార్చే పనిలో పడింది అధిష్టానం.
By Srikanth Gundamalla Published on 15 July 2024 7:18 AM ISTబీజేపీ కొత్త అధ్యక్షుడి ఎన్నికకు మొదలైన కసరత్తు
బీజేపీ జాతీయ అధ్యక్షుడిని మార్చే పనిలో పడింది అధిష్టానం. జేపీ నడ్డా స్థానంలో కొత్త వ్యక్తిని అధ్యక్ష పదవిలో కూర్చబెట్టనుంది. డిసెంబర్ నెలాఖరు వరకు కొత్త సారధి ఎంపిక పూర్తి కానుంది. అయితే.. జేపీ నడ్డా పదవీకాలం ఎప్పుడో పూర్తయింది. ఎన్నికల నేపథ్యంలో గత నెల వరకు ఆయన పదవీకాలాన్ని పొడిగించారు. అదికూడా ముగియడంతో కొత్త అధ్యక్ష ఎన్నికకు కసరత్తు వేగవంతం చేశారు. ఈ సంస్థాగత ఎన్నికల ప్రక్రియకు ఆగస్టు 1న ప్రాథిమిక సభ్యత్వ నమోదుతో శ్రీకారం చుట్టనున్నారు. సెప్టెంబర్ 15వ తేదీ వరకు ఇది కొనసాగనుంది. సెప్టెంబరు 16 నుంచి 30 వరకు క్రియాశీల సభ్యత్వ ప్రక్రియ కొనసాగుతుంది.
బీజేపీ నియామవళి ప్రకారం ప్రతి సభ్యుడు తొమ్మిదేళ్లకు ఒకసారి తప్పనిసరిగా సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. ఈ ఏడాది ప్రధాని మోదీ సహా పార్టీ నాయకులంతా రెన్యువల్ చేసుకోవాలి. నవంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు పార్టీ మండల అధ్యక్షులు, 16-30 వరకు జిల్లా అధ్యక్షుల ఎన్నికల జరుగుతుంది. ఆ సమయంలోనే రాష్ట్ర, జాతీయ కొత్త కార్యవర్గాలను ఎంపిక చేస్తారు. డిసెంబర్ 1న రాష్ట్రాల అధ్యక్షుల ఎన్నికల మొదలు అవుతుంది. సగం రాష్ట్రాల అధ్యక్షుల ఎన్నిక నియామకం పూర్తికాగానే జాతీయ అధ్యక్షుడిని అధికారిక ప్రక్రియను ప్రకటిస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో పూర్తి మెజార్టీ బీజేపీ సాధించలేకపోయింది. దాంతో.. బీజేపీకి సంస్థాగత ఎన్నికలు కీలకంగా మారాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.