హైదరాబాద్‌లో అసదుద్దీన్‌ ఒవైసీని ఓడిస్తాం: కిషన్‌రెడ్డి

లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి బీజేపీ సత్తా చూపెట్టబోతుందని కిషన్‌రెడ్డి అన్నారు.

By Srikanth Gundamalla  Published on  15 March 2024 12:16 PM GMT
bjp, kishan reddy, comments,  lok sabha, election,

 హైదరాబాద్‌లో అసదుద్దీన్‌ ఒవైసీని ఓడిస్తాం: కిషన్‌రెడ్డి 

సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని పలు డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాలను శుక్రవారం కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి బీజేపీ సత్తా చూపెట్టబోతుందని అన్నారు. తెలంగాణలో 17 సీట్లలో విజయం సాధించడమే లక్ష్యంగా తమ పార్టీ ముందుకు వెళ్తోందని చెప్పారు. ప్రజలు మరోసారి మోదీ నాయకత్వాన్ని బలపరచాలని ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి కోరారు.

లోక్‌సభ ఎన్నికల్లో ఈసారి తెలంగాణలో బీజేపీ మెజార్టీ సీట్లు సాధించబోతుందని కిషన్‌రెడ్డి దీమా వ్యక్తం చేశారు. మజ్లీస్‌ పార్టీ ఎప్పటి నుంచో గెలుచుకుంటూ వస్తోన్న హైదరాబాద్‌ స్థానంలో బీజేపీ జెండాను ఎగురవేస్తామన్నారు. అసదుద్దీన్ ఒవైసీని ఓడిస్తామని చెప్పారు. పార్లమెంట్‌ ఎన్నికలకు బీజేపీ యంత్రాంగమంతా సిద్దంగా ఉందని కిషన్‌రెడ్డి అన్నారు. రాబోయే ఎన్నికలు ధర్మయుద్ధం లాంటివనీ.. ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలని కోరారు. దేశ ప్రగతి కోసం ప్రధాని నరేంద్ర మోదీ 10 ఏళ్లుగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారని అన్నారు. మరోసారి మోదీ సర్కార్‌ను దేశ ప్రజలు ఆశీర్వదించాలని కిషన్‌రెడ్డి కోరారు. రాబోయే ఐదేళ్లపాటు మరింత అభివృద్ధిని సాధిస్తామని చెప్పారు.

లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400 సీట్లు గెలవాలనే టార్గెట్‌తో బీజేపీ శ్రేణులంతా పనిచేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ న్యాయం చేశారని చెప్పారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల తర్వాత 4 సెక్టార్ల ద్వారా దేశంలో పనిచేస్తామని చెప్పారు. మహిళలు, యువకులు, రైతులు, పేదల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్తామన్నారు. లోక్‌సభ బీజేపీ అభ్యర్థులను ప్రజలు ఆశీర్వదించాలని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కోరారు.

Next Story