మల్కాజ్‌గిరిలో వారికి డిపాజిట్లు కూడా దక్కవు: ఈటల రాజేందర్

హైదరాబాద్‌లో బీజేపీ ఎంపీ అభ్యర్థి మీట్‌ ద ప్రెస్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు.

By Srikanth Gundamalla  Published on  7 May 2024 3:15 PM IST
bjp, etela rajender,   malkajgiri, lok sabha election,

మల్కాజ్‌గిరిలో వారికి డిపాజిట్లు కూడా దక్కవు: ఈటల రాజేందర్

హైదరాబాద్‌లో బీజేపీ ఎంపీ అభ్యర్థి మీట్‌ ద ప్రెస్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్‌ పార్టీలపై ఈటల రాజేందర్‌ విమర్శలు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌ పార్టీలు ప్రజలను మోసం చేశాయని ఆరోపించారు. మల్కాజ్‌గిరి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు కనీసం డిపాజిట్లు కూడా దక్కవని అన్నారు.

అయితే.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రజలకు పెద్దగా తెలియదనీ.. అలాంటప్పుడు వారికి ఎలా ఓట్లు వేస్తారని ఈటల వ్యాఖ్యానించారు. ఏ సర్వే సంస్థకు కూడా అందని ఫలితాలు మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంలో రాబోతున్నాయని అన్నారు. తన గెలుపు ఖాయం అయ్యిందనీ.. మెజార్టీ మాత్రమే తెలియాల్సి ఉందని దీమా వ్యక్తం చేశారు. మైనారిటీలు కూడా బీజేపీ పార్టీకి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. తెలంగాణలో బీజేపీకి ఆదరణ పెరిగిందనీ పేర్కొన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు కలుషిత రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. గత 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటివి చూడలేదని ఈటల రాజేందర్ అన్నారు.

కాంగ్రెస్‌ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఈటల అన్నారు. మహిళలకు బస్సుల్లో ఫ్రీ జర్నీ తప్పిదే దేన్నీ పూర్తిస్తాయిలో అమలు చేయడం లేదని ఆరోపించారు. అలాగే కాళేశ్వరం అవినీతి పరులపై చర్యలు తీసుకుంటామనీ.. ఏదేదో చేశారని కానీ ఇప్పుడు చప్పుడే లేదన్నారు. కమిటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. గతంలో బీఆర్ఎస్‌ ప్రభుత్వంలోనే కాదు.. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని ఈటల అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో రైతుల ఓట్లను ఆకర్షించేందుకే ఇప్పుడు రైతుభరోసా నిధులు విడుదల చేశారని అన్నారు. మరోవైపు రాష్ట్రంలో కరెంటు కోతలు ఉన్నాయనీ చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటువేయడం ద్వారా రాష్ట్రానికి ఒరిగేది ఏమీ ఉండదని మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు.

Next Story