ఓడితే రాజకీయ సన్యాసం తీసుకుంటా.. మంత్రి పొన్నంకు బండి సంజయ్ సవాల్

తెలంగాణలో రాజకీయాలు గరంగరంగా కొనసాగుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on  27 Feb 2024 6:58 AM GMT
bandi sanjay, challange,  minister ponnam, telangana politics ,

ఓడితే రాజకీయ సన్యాసం తీసుకుంటా.. మంత్రి పొన్నంకు బండి సంజయ్ సవాల్

తెలంగాణలో రాజకీయాలు గరంగరంగా కొనసాగుతున్నాయి. అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్ చెబుతుంటే.. బీఆర్ఎస్‌ దానికి ధీటుగా సమాధానాలు ఇస్తోంది. ఇక బీఆర్ఎస్ వర్సెస్‌ కాంగ్రెస్ వార్‌ నడుస్తోందని అనుకుంటున్న సమయంలో.. తాజాగా బీజేపీ నేత బండి సంచలన కామెంట్స్ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సవాల్‌ విసిరారు.

మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సవాల్ విసిరారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తాను కరీంనగర్‌ నుంచి పోటీ చేస్తాననీ.. ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు. తనకు పోటీగా నిలబడే కాంగ్రెస్ ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకునేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ సిద్ధంగా ఉన్నారా? అని చాలెంజ్ విసిరారు. సిద్దిపేట జిల్లాలో ప్రస్తుతం బండి సంజయ్‌ ప్రజాహిత యాత్ర కొనసాగుతోంది. యాత్రలో పాల్గొన్న ఆయన ఈ కామెంట్స్ చేశారు.

తాను ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయలేదని బండి సంజయ్ అన్నారు. అయోధ్యలో రాముడు జన్మించినట్లు గ్యారెంటీ ఏంటని మీరు ప్రశ్నించడం వల్లే.. నేను నా తల్లికి పుట్టినట్లు గ్యారెంటీ ఏంటి అంటే నువ్వేందుకు మీద వేసుకుంటున్నావని బండి సంజయ్.. మంత్రి పొన్నంను ఉద్దేశించి మాట్లాడారు. తనని అనవసరంగా గెలుకుతున్నారని.. శాంతియుతంగా యాత్ర చేస్తుంటే మీకేం వచ్చిందంటూ బండి సంజయ్ మండిపడ్డారు. రాముడిని ఎవరైనా సరే ఏదైనా అంటే ఊరుకునేది లేదని కౌంటర్ బండి సంజయ్ ఇచ్చారు.

ఇక కాంగ్రెస్ కార్యకర్తలను మంత్రి పొన్నం రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. హుస్నాబాద్‌లో ప్రజాహిత యాత్రకు వస్తున్న స్పందనను చూసి తట్టుకోలేక దాడి జరిపించేందుకు చూశారని మండిపడ్డారు. గౌరవంగా మాట్లాడితే ..దాన్ని చేతగాని తనం అనుకుంటే మాత్రం పర్యావసనాలు మరోలా ఉంటాయని హెచ్చరించారు. కాగా.. మంత్రి పొన్నం ప్రభాకర్‌పై బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేశారు. బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొన్ని చోట్ల రాళ్లు విసురుతున్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి.


Next Story