కాంగ్రెస్ అధిష్టానం ఎక్కడ చెబితే అక్కడే పోటీ చేస్తా: వైఎస్ షర్మిల

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విజయవాడలోని 'ఆంధ్రరత్న' భవన్‌లో కడప నేతలతో సమావేశం అయ్యారు.

By Srikanth Gundamalla  Published on  21 March 2024 6:15 PM IST
ap congress, ys sharmila,  elections,

కాంగ్రెస్ అధిష్టానం ఎక్కడ చెబితే అక్కడే పోటీ చేస్తా: వైఎస్ షర్మిల

ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు దాదాపుగా ఎన్నికల కోసం అభ్యర్థులను ఖరారు చేశాయి. అయితే.. కాంగ్రెస్ మాత్రం ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు. ఈ క్రమంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్‌ వైఎస్ షర్మిల ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై ఆసక్తి కొనసాగుతోంది. ఆమె కడప నుంచి బరిలో ఉంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. సీఎం జగన్‌కు పోటీగా నిలబడతారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే వైఎస్‌ షర్మిల తాజాగా రాబోయే ఎన్నికల్లో పోటీపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విజయవాడలోని 'ఆంధ్రరత్న' భవన్‌లో కడప నేతలతో సమావేశం అయ్యారు. ఈ మేరకు మాట్లాడిన ఆమె.. కాంగ్రెస్ అధిష్టానం ఎక్కడి నుంచి పోటీకి దిగాలని సూచిస్తే అక్కడి నుంచి బరిలోకి దిగేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ఇక కాంగ్రెస్‌ అధిష్టానం ఆదేశిస్తే తనతో సహా ఏ స్థాయిలో ఉన్న నాయకుడైనా కూడా పోటీకి, లేదా త్యాగానికైనా సిద్ధంగా ఉండాలని ఆమె చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ ఆదేశిస్తే మాత్రం ఎక్కడి నుంచైనా సరే పోటీకి సంసిద్ధంగా ఉన్నట్లు వైఎస్ షర్మిల పేర్కొన్నారు.

ఈ సమావేశంలోనే సజ్జల రామకృష్ణారెడ్డి గురించి కూడా ప్రస్తావించారు వైఎస్ షర్మిల. ప్రజల సమస్యలపై ఎప్పుడూ మాట్లాడని సజ్జల రామకృష్ణారెడ్డి తమ గురించి మాత్రం ఎందుకు ఆలోచిస్తున్నారని ప్రశ్నించారు. వైసీపీ నాయకులను ఇంటికి పరిమితం చేసేందుకు ఏపీ ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పోలవరం, రాజధాని, స్టీల్ ఫ్యాక్టరీతో పాటు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్సే అని వైఎస్ షర్మిల చెప్పారు. అవినాశ్‌రెడ్డి సీఎం జగన్‌కు సొంత కజిన్‌ అనీ.. ఆయన వైసీపీలో ఉండి కూడా కడప స్టీల్‌ ఫ్యాక్టరీ కోసం ఎందుకు పోరాటం చేయలేదని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా తమకు 1500 దరఖాస్తులు అందాయని చెప్పారు. వీటన్నింటినీ పరిశీలిస్తున్నామనీ.. సర్వేల తర్వాత అభ్యర్థులను ఫైనల్‌ చేస్తామని చెప్పారు. అధిష్టానం ఆమోదం తర్వాతనే కాంగ్రెస్‌ జాబితా ఉంటుందని వైఎస్ షర్మిల చెప్పారు.

Next Story