షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం రాజకీయ తప్పిదం: విజయసాయిరెడ్డి
వైఎస్ షర్మిలపై రాజ్యసభ ఎంపీ, వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.
By Srikanth Gundamalla Published on 12 April 2024 5:48 AM GMTషర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం రాజకీయ తప్పిదం: విజయసాయిరెడ్డి
తెలంగాణలో వైఎస్‌ఆర్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తర్వాత షర్మిల ఏపీకి వెళ్లిపోయింది. ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా అధిష్టానం బాధ్యతలను అప్పగించింది. ఈ నేపథ్యంలో ఆమె కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి.. ఎక్కువ స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే సొంత అన్న సీఎం జగన్‌తో పాటు వైఎస్సార్‌సీపీ నేతలు, ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. గతంలో టీడీపీ.. ఇప్పుడు వైసీపీ రాష్ట్ర అభివృద్ధి కోసం .. ప్రజా సంక్షేమం కోసం పెద్దగా ఎలాంటి చర్యలు తీసుకోలేందంటూ మండిపడుతున్నారు. వైఎస్సార్‌కి వారసుడు జగన్ కాదంటూ.. ఆయన కేవలం ఆస్తులకే వారసుడంటూ సంచలన కామెంట్స్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే రాజకీయంగా షర్మిలను కూడా వైసీపీ పార్టీ ఎదుర్కొంటోంది. తిరిగి విమర్శలు చేస్తున్నారు ఆ పార్టీ నాయకులు. తాజాగా వైఎస్ షర్మిలపై రాజ్యసభ ఎంపీ, వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. జగన్‌తో షర్మిల రాజకీయంగా విభేదించిన మాట వాస్తవమే అని చెప్పారు. తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు షర్మిలను తాము ఏమీ అనలేదని చెప్పారు. ఏపీకి వచ్చి కాంగ్రెస్‌లో చేరడం మాత్రం షర్మిల చేసిన రాజకీయ తప్పిదమని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు.
ఎన్డీఏలో చేరికపై విజయసాయిరెడ్డి స్పందించారు. ఎన్డీఏలో చేరాలని తమ పార్టీకి 2014లోనే ఆఫర్ వచ్చిందని వెల్లడించారు. దానికి తాము నిరాకరించినట్లు చెప్పారు. ఆ తర్వాతే బీజేపీ టీడీపీతో జత కట్టిందని వెల్లడించారు. వైసీపీ ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోదని ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి చెప్పారు. అంశాల వారీగానే గతంలో ఎన్డీఏకు మద్దతు ఇచ్చాం కానీ.. పూర్తిగా పార్టీతో కలిసి పనిచేయలేదని క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు కూడా తాము కాదన్నాకే బీజేపీ, టీడీపీతో జత కట్టిందని విజయసాయిరెడ్డి అన్నారు.