ఇవే నాకు చివరి ఎన్నికలు.. కొడాలి నాని ఆసక్తికర కామెంట్స్
ఇప్పుడు జరగబోయే ఎన్నికలే తనకు చివరి ఎన్నికలు అని వైసీపీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు.
By Srikanth Gundamalla
ఇవే నాకు చివరి ఎన్నికలు.. కొడాలి నాని ఆసక్తికర కామెంట్స్
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు సమరశంఖం పూరించాయి. ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నాయి. ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలే తప్ప అభివృద్ధి చేసిందేమీ లేదంటూ ప్రతిపక్ష పార్టీలు జోరుగా విమర్శలు చేస్తున్నాయి. మరోవైపు అధికార పార్టీ వైసీపీ తాము తీసుకొచ్చిన సంక్షేమ పథకాలతో రాష్ట్రం అభివృద్ధిలో ముందుందని ప్రతిపక్షాలకు కౌంటర్ ఇస్తున్నారు. మరోవైపు పలువురు రాజకీయ నాయకులు పార్టీలు మారుతూ ఉత్కంఠ రేపుతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ గుడివాడ ఎమ్మెల్యే తన రాజకీయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇప్పుడు జరగబోయే ఎన్నికలే తనకు చివరి ఎన్నికలు అని వైసీపీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. 2029లో జరగబోయే ఎన్నికల్లో తాను పోటీ చేయబోను అని స్పష్టం చేశారు. తనకు వయసు అయిపోతుందంటూ కొడాలి నాని చెప్పారు. ఇప్పుడు తన వయసు 52 ఏళ్లు అనీ.. 2029 ఎన్నికల సమయానికి తనకు రిటైర్మెంట్ వయసు వస్తుందని చెప్పారు. మరోవైపు తన కూతుళ్లకు రాజకీయాలపై ఎలాంటి ఆసక్తి లేదని స్పష్టం చేశారు మాజీమంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని. ఈసారి కూడా వైసీపీ ప్రభుత్వం వస్తే తనకు మంత్రి పదవి కూడా అవసరం లేదన్నారు. తన నియోజకవర్గంలో రోడ్లకు పర్మినెంట్‌గా స్ట్రక్చర్ వేయాలని, రోడ్లు, కాలువలు, వాల్స్‌కు సీఎం జగన్ డబ్బులు విడుదల చేస్తే చాలని కొడాలి నాని అన్నారు.
నియోజకవర్గంలో కొన్ని పనులు మిగిలిపోయాయని చెప్పారు కొడాలి నాని. ఆ పనులు పూర్తయిన తర్వాత తాను ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పారు. ఇక గుడివాడ టికెట్ ఎవరికి ఇచ్చిన తనకు అనవసరమి చెప్పారు. అయితే.. తన తమ్ముడి కొడుకు రాజకీయాల్లోకి వస్తే రావొచ్చనే అనే కామెంట్స్ కూడా చేశారు కొడాలి నాని. స్వయంగా కొడాలి నాని ఇవే తనకు చివరి ఎన్నికలు అని చెప్పడంతో కార్యకర్తలతో పాటు, వైసీపీ నాయకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రత్యర్థి పార్టీలు ఇదంతా కొడాలి నాని వ్యూహమే అనీ.. సింపతి కోసం ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నాయి.