షర్మిలకు ప్రాణహాని ఉంది..భద్రత పెంచాలి: అయ్యన్నపాత్రుడు

ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

By Srikanth Gundamalla  Published on  30 Jan 2024 8:10 AM GMT
andhra pradesh, tdp, ayyannapatrudu,  cm jagan, ycp,

షర్మిలకు ప్రాణహాని ఉంది..భద్రత పెంచాలి: అయ్యన్నపాత్రుడు 

ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి రాకముందు ఒక్క అవకాశమని చెప్పిన జగన్.. పదవి బాధ్యతలు తీసుకున్నాక ప్రజలను అస్సలు పట్టించుకోలేదని అన్నారు. ఉత్తరాంధ్రకు సీఎం జగన్ ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్. భూములను కబ్జా చేయడమే వైసీపీ పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. విశాఖలోని టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంపై అయ్యన్నపాత్రుడు విమర్శలు చేశారు.

భూములు కనిపిస్తే చాలు వైసీపీ నాయకులు బెదిరించి కబ్జాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు చేశారు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. వైసీపీ నాయకుల అక్రమాలు, దౌర్జన్యాలకు అంతే లేకుండా పోయిందన్నారు. నియంతలా సీఎం జగన్ పాలన ఉందని అన్నారు. రాష్ట్రంలో సీఎం జగన్ పాలనలో ఏ వర్గ ప్రజలూ సంతోషంగా లేరని అన్నారు. భద్రత కరువైందని చెప్పారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారని అయ్యన్నపాత్రుడు అన్నారు. నాలుగున్నరేళ్లలో సీఎం జగన్ ఉత్తరాంధ్రకు ఏ చేశారని సభ పెట్టారంటూ ప్రశ్నించారు. విశాఖ బీచ్‌ రోడ్డు నుంచి భీమిలీ వెళ్లే వరకు ప్రభుత్వ భూములను ఎక్కడైనా మిగిల్చారా అని నిలదీశారు. ఉత్తరాంధ్ర ప్రజలు వైసీపీకి ఎందుకు ఓటేస్తారని ప్రశ్నించారు. మూడు నెలల తర్వాత అందరి లెక్కలు తీస్తామనీ.. ఆ ఎన్నికల తర్వాత జగన్ లండన్.. అమెరికా ఇలా ఇతర దేశాల్లో ఎక్కడ దాక్కున్నా లాక్కొచ్చి దోచుకుని దాచుకున్న సొమ్మునంతా కక్కిస్తామంటూ అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సీఎం జగన్‌కు తల్లి, చెల్లి, బాబాయ్‌ అనే తేడా లేదన్నారు అయ్యన్నపాత్రుడు. అలాంటి వ్యక్తిని తానొక లెక్కే కాదని చెప్పారు. అంతెందుకు షర్మిలను అంతమొందించిన అశ్చర్యపోవాల్సిన పనిలేదని అన్నారు. షర్మిలకు భద్రత పెంచాల్సిన అవసరం ఉందంటూ కామెంట్స్ చేశారు. అయితే.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆస్తిలో షర్మిలకు వాటా రాశారు.. అది జగన్‌ ఇవ్వట్లేదని చెప్పారు అయ్యన్నపాత్రుడు. తనకు కూడా ప్రాణహాని ఉందనీ.. రివాల్వర్‌ లైసెన్స్‌ రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. గన్‌మెన్‌ ఇస్తామని ఎస్పీ చెప్పారనీ.. కానీ నిరాకరించినట్లు తెలిపారు. తానెక్కడున్నానో గన్‌మెన్‌లు సమాచారం ఇచ్చే అవకాశాలు ఉన్నందుకే గన్‌మెన్లను వద్దని చెప్పానన్నారు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు

Next Story