వైసీపీ నేతలైనా వదిలిపెట్టను.. విజయసాయిరెడ్డి వార్నింగ్
ఏపీలో కూటమి ప్రభుత్వం వ్యవహారంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 15 July 2024 7:00 AMవైసీపీ నేతలైనా వదిలిపెట్టను.. విజయసాయిరెడ్డి వార్నింగ్
ఏపీలో కూటమి ప్రభుత్వం వ్యవహారంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలపై దాడులకు తెగబడుతున్నారని అన్నారు. కొత్త ప్రభుత్వం దౌర్జన్యాలు ఎక్కువయ్యాయంటూ ఆరోపణలు చేశారు. ప్రజలు కూటమి ప్రభుత్వ రాక్షస పాలనను గమనిస్తున్నారనీ చెప్పారు. వైసీపీపై బురదజల్లే ప్రయత్నం చేసినా.. ఫలితం ఉండనది ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.
కొందరు తన పేరు, ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నారని విజయసాయిరెడ్డి అన్నారు. అసత్య ఆరోపణలు చేయడం ఏమాత్రం సబబు కాదన్నారు. తనపై దుష్ప్రచారం చేసేవారికి విజయసాయిరెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అసత్య ప్రచారం తనపై చేస్తే అవతలివారు ఎంతటి వారైనా వదలిపెట్టనని అన్నారు. దుష్ప్రచారం చేసేది వైసీపీ నాయకులు అయినా కూడా వదలను అన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. తనను భయటపెట్టేందుకు ఏవేవో పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నారనీ.. తాను భయపడే రకం కాదని తెలుసుకోవాలన్నారు. తాటాకు చప్పుళ్లకు, బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.
ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని వెనక్కి తగ్గబోము అని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు మధ్యంతర ఎన్నికలు జరిగినా వైసీపీ గెలుస్తుందని చెప్పారు. ఇక అధికారం ఎవరికీ శాశ్వతం కాదనీ ఇది గమనించాలంటూ హితవు పలికారు. తాము కూడా మళ్లీ అధికారంలోకి వస్తామనీ తోకలు కత్తిరిస్తామంటూ దుష్ప్రచారం, అసత్య ఆరోపణలు చేస్తున్న వారికి సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారు ఎంపీ విజయసాయిరెడ్డి.