అక్రమాల్లో జగన్ తర్వాత పెద్దిరెడ్డే: మంత్రి రామ్‌ప్రసాదరెడ్డి

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ పాలనపై రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి రామ్ ప్రసాద్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.

By Srikanth Gundamalla  Published on  1 July 2024 1:58 AM GMT
Andhra Pradesh, minister Ramprasad reddy,  ycp,

 అక్రమాల్లో జగన్ తర్వాత పెద్దిరెడ్డే: మంత్రి రామ్‌ప్రసాదరెడ్డి

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ పాలనపై రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి రామ్ ప్రసాద్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ పాలనలో జగన్ తర్వాత ఎక్కువ అక్రమాలకు పాల్పడింది పెద్దిరెడ్డే అని చెప్పారు. అధిక మొత్తంలో అక్రమార్జన కూడబెట్టింది పెద్దిరెడ్డే అని ఆరోపించారు. వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి టీడీపీపై చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. రాయలసీమ జిల్లాల్లో పెద్దిరెడ్డిదే అతిపెద్ద మాఫియా కుటుంబం అంటూ ధ్వజమెత్తారు. ఖనిజ సంపదను మొత్తం దోచుకున్నారని మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి అన్నారు. పెద్దిరెడ్డి కుటుంబానికి సంబంధించి ల్యాండ్, వైన్, మైన్‌ కుంభకోణాలను త్వరలోనే ఆధారాలతో సహా బయటపెడతామని అన్నారు. శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందనే మిథున్‌రెడ్డికి అన్నమయ్య జిల్లా వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని, అందులో తప్పేముందని మంత్రి రామ్‌ ప్రసాద్‌ రెడ్డి ప్రశ్నించారు.

రాష్ట్ర మహిళలంతా ఉచిత బస్సు ప్రయాణం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఫ్రీ బస్సు గురించి ఆయన వివరించారు. విశాఖపట్నం నుంచే ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. త్వరలోనే రాష్ట్ర మహిళలకు తీపికబురు చెబుతామని మంత్రి రామ్‌ప్రసాదరెడ్డి పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేస్తున్నామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వంలో విలీనం చేయలేదని, తాము ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అవసరం మేరకు బస్సుల సంఖ్య పెంచుతామని మంత్రి రామ్‌ప్రసాదరెడ్డి చెప్పారు. అలాగే ఎలక్ట్రికల్‌ సర్వీసులు అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించారు. జగన్‌ హయాంలో రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలను తరిమేశారని, కొత్త వాటిని ప్రోత్సహించలేదన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఒప్పందాలు చేసుకున్న పరిశ్రమలను ఇప్పుడు స్థాపించేలా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారని మంత్రి రామ్‌ప్రసాదరెడ్డి వెల్లడించారు.

Next Story