కొంతమంది పోలీసులు పద్ధతి మార్చుకోవాలి: ఏపీ హోంమంత్రి
ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సంచలన కామెంట్స్ చేశారు.
By Srikanth Gundamalla Published on 14 Jun 2024 8:00 PM ISTకొంతమంది పోలీసులు పద్ధతి మార్చుకోవాలి: ఏపీ హోంమంత్రి
ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సంచలన కామెంట్స్ చేశారు. చంద్రబాబు అంటేనే శాంతిభద్రతలు పూర్తిస్థాయిలో ఉంటాయనే నమ్మకం ప్రజల్లో ఉంటుందన్నారు. ఈ మేరకు కొంతమంది పోలీసులు పద్ధతి మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. అలాగే రాబోయే కాలంలో పోలీసు వ్యవస్థలో మార్పును తీసుకొస్తామని వ్యాఖ్యానించారు. అయితే.. పోలీసు తీరులో మార్పు రాకపోతే తామే మారుస్తామని అన్నారు. రాష్ట్రంలో ఇక మహిళలు ఇబ్బందులు ఉండబోవు అని వంగలపూడి అనిత అన్నారు. స్వేచ్ఛగా ఉండొచ్చని చెప్పారు.
మాచర్లలో చంద్రయ్య వంటి హత్య కేసులను రీఓపెన్ చేయిస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపించి నిందితులను కఠినంగా శిక్షించేలా చూస్తామన్నారు. టీడీపీ కార్యకర్తలు, నేతలు, గత ఐదేళ్లలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆమె అన్నారు. అక్రమ కేసులు అన్నింటిపై కూడా సమీక్ష తప్పనిసరిగా చేస్తామని వెల్లడించారు. చివరకు చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని కూడా శాసనసభ వేదికగా కించపరిచారంటూ వైసీపీఐ హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. చంద్రబాబు ఈ సంఘటన తర్వాత కన్నీటి పర్యంతం అయ్యారనే విషయాన్ని గుర్తు చేశారు. ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఉప్పెన వచ్చిందన్నారు హోంమంత్రి వంగలపూడి అనిత.
చంద్రబాబు పాలన రావాలని రాష్ట్ర ప్రజలంతా కోరుకున్నారని మంత్రి వంగలపూడి అనిత అన్నారు. అందుకే రాష్ట్ర ప్రజలంతా కలిసి ఏక తీర్పు ఇచ్చారని అన్నారు. చంద్రబాబుకి పట్టం కట్టి రాష్ట్రం బాగు కోరకున్నారని అన్నారు. విశాఖలో గతంలో డాక్టర్ సుధాకర్‌ను ఎలా హత్య చేశారో కళ్లారా చూశామని చెప్పారు. విశాఖలో వారి కుటంబ సభ్యులను కూడా వెళ్లి కలుస్తానని హోంమంత్రి అనిత చెప్పారు. తనకు కీలక హోంశాఖను అప్పగించిన సీఎం చంద్రబాబుకి హోంమంత్రి వంగలపూడి అనిత ధన్యవాదాలు చెప్పారు. తన పదవికి న్యాయం చేసి.. ప్రజల భద్రత కోసం పనిచేస్తానని ఆమె చెప్పారు.