జనసేనలోకి ఆ వైసీపీ నేత సోదరుడు
ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో పలు పార్టీలలో చేరికల పర్వం కొనసాగుతూ ఉంది. జనసేన వైపు పలువురు నాయకులు చూస్తూ ఉన్నారు.
By అంజి
జనసేనలోకి ఆ వైసీపీ నేత సోదరుడు
ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో పలు పార్టీలలో చేరికల పర్వం కొనసాగుతూ ఉంది. జనసేన వైపు పలువురు నాయకులు చూస్తూ ఉన్నారు. పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో టీడీపీ, వైసీపీలను కాదని జనసేన వైపు అడుగులు వేస్తూ ఉన్నారు కొందరు నాయకులు. తాజాగా చీరాల మాజీ ఎమ్మెల్యే,వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములు జనసేన పార్టీలో చేరనున్నారు. జూన్ 12న పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకోనున్నారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు ముందే 12న మంగళగిరి లోని పానకాల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో పవన్ కళ్యాణ్ నిర్వహించే పూజా సమయంలోనే జనసేన పార్టీలో చేరాలని ఆమంచి స్వాములు నిర్ణయించుకున్నారు. చీరాలలో తన నూతన గృహప్రవేశం రోజున పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించి బహిరంగ సభ పెట్టాలని ఆమంచి స్వాములు ముందు భావించారు. కానీ సమయాభావం కుదరక పోవడంతో వారాహి యాత్రకు ముందే జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు.
పవన్ కళ్యాణ్ విధానాలు నచ్చి, ఆయన ఆలోచనలు నచ్చి పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని ఆయన తెలిపారు. జనసేన పార్టీ బలోపేతం కోసమే తాను పనిచేయాలని అనుకున్నానని.. పదవుల కోసం కాదని తెలిపారు. జనసేన నుండి తనకు సీటు ఇచ్చినా.. ఇవ్వకపోయినా పార్టీ బలోపేతం కోసం పనిచేస్తానని అన్నారు. కానీ పార్టీ టికెట్ ఇస్తే పోటీలో ఉంటానని తెలిపారు.