వాలంటీర్లపై కుట్ర చేస్తున్నారు..చూస్తూ ఊరుకోం: ఆళ్ల నాని
వాలంటీర్ల వ్యవస్థపై పవన్, చంద్రబాబు విషం చిమ్ముతున్నారని అన్నారు ఆళ్ల నాని.
By Srikanth Gundamalla
వాలంటీర్లపై కుట్ర చేస్తున్నారు..చూస్తూ ఊరుకోం: ఆళ్ల నాని
వాలంటీర్ల వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అధికార పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబుని టార్గెట్ చేస్తూ కౌంటర్లు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి ఆళ్ల నాని స్పందించారు. వాలంటీర్ల వ్యవస్థను కూలదోయడానికి పవన్ నీచానికి దిగజారారు అని, చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతున్నారని మండిపడ్డారు. ఏలూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంగా ఆళ్ల నాని ఈ వ్యాఖ్యలు చేశారు.
వాలంటీర్ల వ్యవస్థపై పవన్, చంద్రబాబు విషం చిమ్ముతున్నారని అన్నారు ఆళ్ల నాని. పేదలకు సంక్షేమ పథకాలను అందించేందుకు సీఎం జగన్ అవినీతి లేకుండా పారదర్శకంగా ఉండేందుకే వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశారని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే పథకాలను ఏ ఒక్క అర్హుడు కోల్పోకూడదనే ఉద్దేశంతోనే ఈ వ్యవస్థను తెచ్చినట్లు వివరించారు. కానీ.. కొందరు నాయకులు వాలంటీర్ల వ్యవస్థను విమర్శిస్తున్నారు.. ఇది ఏమాత్రం సరికాదని అన్నారు. ప్రజలకు మంచి చేస్తుంటే చూడలేకే సీఎం జగన్‌పై అసత్య ప్రచారాలు, దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆళ్ల నాని అన్నారు. దూషణల ద్వారా ప్రజల చులకన చేసి, అప్రతిష్టపాలు చేసి రాజకీయ లబ్ధి పొందాలని చంద్రబాబు, పవన్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు చేసిన కుట్రలేవి ఫలించకే ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థను టార్గెట్‌గా విషం చిమ్ముతున్నారని ఆళ్ల నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే.. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్‌నే పవన్ కళ్యాణ్ చదువుతున్నారని, ఇద్దరు కలిసి వాలంటీర్ల వ్యవస్థను దెబ్బతీయాలని చూస్తున్నారని అన్నారు. పవన్ రెండు నాలుకల ధోరణిని ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా కోరారు ఆళ్ల నాని. పవన్ కళ్యాణ్ ఇకనైన అసత్య ప్రచారాలు మానుకోవాలని.. వాలంటీర్ల జోలికి వస్తూ చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మహిళల అక్రమ రవాణాకు, వాలంటీర్లకు ఏంటి సంబంధం అన్నది పవన్ కళ్యాణ్ చెప్పాలన్నారు. ప్రజలే మీలాంటి వారిని తరిమికొడతారని మాజీ మంత్రి ఆళ్ల నాని అన్నారు.