టీఆర్ఎస్ బహిరంగ సభకు సర్వం సిద్దం.. సీపీఐ మద్దతు తెరాసకే..!
All set for CM KCR Praja Deevena Sabha in Munugode.మునుగోడులో నేడు(శనివారం) జరగబోయే టీఆర్ఎస్ ప్రజాదీవెన
By తోట వంశీ కుమార్ Published on 20 Aug 2022 11:51 AM ISTమునుగోడులో నేడు(శనివారం) జరగబోయే టీఆర్ఎస్ ప్రజాదీవెన సభకు సర్వం సిద్దమైంది. పార్టీ అధినేత సీఎం కేసీఆర్ వస్తుండడంతో సభా ప్రాంగణంతో పాటు మునుగోడు మొత్తం గులాబీమయంగా మారింది. మునుగోడు ఎంపీడీవో కార్యాలయ శివారులో సుమారు లక్షన్నర మంది కూర్చోనేలా 25 ఎకరాల్లో సభా వేదికను ఏర్పాటు చేశారు. సభా వేదికపై నుంచే ముఖ్యమంత్రి కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నికకు సమరశఖం పూరించనున్నారు.
బహిరంగ సభతో తమ సత్తాచాటి సాధారణ ఎన్నికలకు ఇప్పటి నుంచే క్యాడర్‌ను సిద్ధం చేసేందుకు సమాయత్తమవుతోంది టీఆర్ఎస్. మునుగోడు ఉప ఎన్నిక జరగడానికి మరో రెండు, మూడు నెలల సమయం ఉన్నప్పటికీ మునుగోడును తమ ఖాతాలో వేసుకునేందుకు ఆ పార్టీ ముఖ్యనేతలు ఇప్పటి నుంచే వ్యూహ రచన చేస్తున్నారు. దీనిలో భాగంగానే పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు మునుగోడు బహిరంగసభకు తీసుకురావడం ద్వారా క్యాడర్‌లో ఉత్సాహాన్ని నింపేలా చూస్తున్నారు. ఉప ఎన్నికను మంత్రి జగదీష్‌రెడ్డి అన్నీతానై చూసుకుంటున్నారు. ఇప్పటికే నియోజకవర్గానికి చెందిన కీలకనేతలను తమ దారికి తెచ్చుకుంటూ, అసంతృప్తులను బుజ్జగించి సభను సక్సెస్ చేసే పనిలో ఉన్నారు.
సీఎం కేసీఆర్ రోడ్డు మార్గంలో మునుగోడు చేరుకుంటారు. సుమారు నాలుగు వేల కార్లతో కూడా భారీ కాన్వాయ్‌తో ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ నుంచి బయలుదేరారు. ఉప్పల్, ఎల్బీనగర్, పెద అంబర్ పేట్, పోచంపల్లి ఎక్స్ రోడ్స్, చౌటుప్పల్, నారాయణ్ పూర్, చల్మెడ, మీదుగా మధ్యాహ్నం రెండు గంటలకు ఆయన మునుగోడు చేరుకుంటారు. సభ కన్నా రెండు గంటల ముందే మునుగోడుకు చేరుకోనున్న సీఎం కేసీఆర్ స్థానిక టీఆర్ఎస్ నాయకులతో సమావేశమయ్యే అవకాశముంది.
సీపీఐ మద్దతు టీఆర్ఎస్ కే..
మునుగొడులో గతంలో బలంగా ఉన్న సీపీఐ పార్టీ ఉప ఎన్నిక వస్తే పోటీ చేస్తుందా లేదా ఎవరికైనా మద్దతిస్తుందా అనే దానిపై నెలకొన్న ఉత్కంఠ నెలకొంది. దీనికి తెరదించుతూ టీఆర్ఎస్ కే మద్దతు ఇవ్వాలని సీపీఐ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో సీఎం కేసీఆర్ చర్చించారు. ఈరెండు పార్టీల మధ్య జరిగిన చర్చల నేపథ్యంలో టీఆర్ ఎస్ కు మద్దతివ్వాలని కమ్యూనిస్టు పార్టీ నాయకులు నిర్ణయించారు. ఈవిషయాన్ని అధికారికంగా ఈ రోజు సభలో కానీ.. అంతకముందే వెల్లడించే అవకాశం ఉంది.
భారీ బందోబస్తు..
సీఎం కేసీఆర్ సభ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా మొత్తం 1300 మంది పోలీసులను మోహరించారు. ఆరుగురు ఎస్పీలు, ఆరుగురు ఏఎస్పీలు, 23 మంది డీఎస్పీలు, 50 మంది సీఐలు, 94 మంది ఎస్సైలు భద్రతా విధులు నిర్వహిస్తున్నారు.