కష్టకాలంలో కనికరించని పోలీసులు
By రాణి Published on 26 March 2020 9:07 AM ISTముఖ్యాంశాలు
- చేసేది లేక వెనుదిరగిన విద్యార్థులు
- ఇంకా వాడపల్లి వద్దే వాహనదారుల పడిగాపులు
కరోనా భయంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. కొంతమందైతే ఇంట్లో కుదురుగా ఉండలేక ప్రభుత్వ లాక్ డౌన్ ఆదేశాలను పట్టించుకోకుండా ఏ పనీ లేకపోయినా బైకులేసుకుని తిరుగుతున్నారు. అలాంటి వారికి పోలీసుల లాఠీ దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అమ్మాయిలనైతే గుంజీలు తీయిస్తున్నారు. లాక్ డౌన్ తో హాస్టల్ విద్యార్థుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. హాస్టళ్లను మూసివేయాలని ప్రభుత్వం చెప్పడంతో భాగ్యనగరంలోని హాస్టళ్లన్నీ మూతపడ్డాయి. మీరంతా మీ ఊళ్లకు వెళ్లిపోండంటూ హాస్టల్ యజమానులు విద్యార్థులను బలవంతంగా ఖాళీ చేయించడంతో దిక్కులేక పోలీస్ స్టేషన్ల మెట్లెక్కారు. అక్కడ పోలీస్ అధికారులను బ్రతిమలాడగా ఇళ్లకు వెళ్లేందుకు పర్మిషన్ లెటర్లిచ్చారు. అంతా బాగానే ఉంది. కానీ..హైదరాబాద్ నుంచి ఆంధ్రా వెళ్లే వారిని మాత్రం పోలీసులు అనుమతించడం లేదు.
Also Read : కరోనా వేళ ఖాకీ జులుం..వేల లీటర్ల పాలు, కూరగాయలు చెత్తకుప్పల్లోకి..
సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద, కృష్ణాజిల్లా గరికపాడు చెక్ పోస్టుల వద్ద విద్యార్థులకు పర్మిషన్ పాసులున్నప్పటికీ పోలీసులు ఆంధ్రాలోకి వచ్చేందుకు అనుమతి నిరాకరించారు. హైదరాబాద్ నుంచి వచ్చేవారిని రాష్ట్రంలోకి అనుమతించాలని తమకెలాంటి ఆదేశాలు రాలేదని పోలీసులు చెప్తున్న మాట. గరికపాడు చెక్ పోస్ట్ వద్దైతే ఆంధ్రాలోకి రావాలంటే.. నూజివీడు ఐఐఐటీలో 14 రోజులు క్వారంటైన్ లో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. అలా క్వారంటైన్ లో ఉండేందుకు 100 మంది విద్యార్థులు ఒప్పుకున్నారు. మిగతా వారు మాత్రం చేసేది లేక ఎలా వెళ్లారో అలాగే హైదరాబాద్ కు తిరుగు పయనమయ్యారు.
Also Read : నీ బిస్కెట్లు తిన్నాను.. నీకు చీటోస్ తేలేనా బాసూ..!
విద్యార్థులే కాదు..హైదరాబాద్ లో ఉండే కుటుంబాలు కూడా తమ సొంత వాహనాల్లో స్వగ్రామాలకు పయనమయ్యాయి. కానీ పోలీసులు మాత్రం వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఆంధ్రాలోకి అనుమతించడంలేదు. ఆంధ్రా కన్నా తెలంగాణలో ఎక్కువ కరోనా కేసులుండటం కూడా ఒక కారణం. అంతర్రాష్ట్ర సరిహద్దులను మూసివేసిన కారణంగా..అటువారిని ఇటు, ఇటువారిని అటు రానివ్వడం లేదు. తెలంగాణ - ఆంధ్రా సరిహద్దు అయిన వాడపల్లి చెక్ పోస్టు వద్ద భారీ మొత్తంలో వాహనాలు నిలిచిపోయాయి. తమకు ఆంధ్రాలోకి వెళ్లేందుకు అనుమతులున్నా ఎందుకు పంపడం లేదంటూ వాహనదారులు పోలీసులను ప్రశ్నిస్తున్నారు. ఒకరికొకరు దూరంగా ఉండాలని ఎంత చెప్తున్నా వినకుండా పోలీసుల చుట్టూ గుంపులుగుంపులుగా చేరుతున్నారు. సుమారు 4-5 గంటలుగా బైకులు, కార్లు వాడపల్లి చెక్ పోస్ట్ వద్ద నిలిచిపోయాయి. కొందరు మాత్రం అడ్డదారులు వెతుక్కుని..పోలీసుల కళ్లుగప్పి మరి ఎలాగొలా ఇళ్లకు చేరుకుంటున్నారు.
https://telugu.newsmeter.in/wp-content/uploads/2020/03/WhatsApp-Video-2020-03-26-at-7.45.58-AM.mp4