ఢిల్లీ: దేశ ప్రధాని నరేంద్రమోదీ సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. సోషల్‌ మీడియాలో అత్యధిక ఫాలోవర్లు కలిగిన రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందిన మోదీ.. అనుహ్యంగా ఈ నిర్ణయం తీసుకోవడంపై నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. దీనికి సంబంధించి ట్విటర్‌ వేదికగా ఆయన ఓ పోస్టు పెట్టారు. తాను ఆదివారం నుంచి సోషల్ మీడియాలో ఉండకూడదన్న ఆలోచన చేస్తున్నానని పోస్టులో వివరించారు. యూట్యూబ్‌, ఇన్‌స్ట్రాగ్రామ్‌, ట్విటర్‌, ఫేస్‌బుక్‌లకు దూరంగరా ఉండాలనుకుంటున్నానని మోదీ పేర్కొన్నారు.

అయితే ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను మాత్రం ప్రధాని మోదీ తెలుపలేదు. మోదీ ట్వీట్‌తో అభిమానులు, బీజేపీ కార్యకర్తలు ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు. సోషల్‌ మీడియా వేదికగా ప్రధాని మోదీ ప్రతి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేవారు. ఇప్పుడు వాటికి దూరంగా ఉండాలనుకుంటున్నానని చెప్పడంతో అభిమానులు నిరాశకు లోనయ్యారు. సోషల్‌ మీడియాలో ఉండకూడదన్న ఆలోచన చేశానని అన్నారే గానీ.. ఉండను అని మోదీ చెప్పలేదు. అయితే ఆదివారం వరకు వేచి చూడాల్సిందేనని కొంతమందిన నెటిజన్లు, అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

ప్రధాని మోదీకి ట్విటర్‌లో 53.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

ఫేస్‌బుక్‌లో 44 మిలియన్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 35.2, యూట్యూబ్‌లో 4.5 మిలియన్ల మంది మోదీని ఫాలో అవుతున్నారు.

ప్రధాని మోదీ చేసిన ట్వీట్‌పై కాంగ్రెస్‌ జాతీయ నేత రాహుల్‌ గాంధీ స్పందించారు. ‘వదిలేయాల్సింది సోషల్‌ మీడియాను కాదని.. ద్వేషాన్ని’ అంటూ ట్వీట్‌ చేశారు.

ప్రధాని మోదీ ట్వీట్‌పై పలువురు ప్రముఖులు కూడా స్పందించారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.