ప్లాస్టిక్ ఫ్రీ మేడారం జాతర ప్రారంభం..
By అంజి
మేడారం జాతరలో తొలి ఘట్టం పూనుగొండ్లలో ప్రారంభమైంది. డోలు వాయిద్యాల సమ్మక్క, సారలమ్మ, పగిడిద్ద, గోవింద రాజునుల మేడారం గద్దెలపైకి తీసుకొస్తున్నారు. జాతరలో ఇసుకెస్తే రాలనంతలా జనం తరలివచ్చారు. ఇప్పటికే మేడారం ఓ మహానగరంలా తలపిస్తోంది. ఇప్పటికే మేడారం పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారిపోయాయి. లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శనం చేసుకుంటున్నారు. రెండు సంవత్సరాల కోకసారి జరిగే ఈ జాతరకు దాదాపు కోటి మంది భక్తులు వస్తారని అంచనా. ఇవాళ్టి నుంచి 8వ తేదీ వరకు ఈ జాతర కొనసాగనుంది. ఈ జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒరిస్సా, మధ్యప్రదేశ్, హిమచల్‌ప్రదేశ్ తదితర రాష్ట్రాల భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. పస్రా, తాడ్వాయి, కాటారం, చిన్నబోయినపల్లి రూట్లలో మేడారం వస్తున్న భక్తుల వాహనాలతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది.
మహాజాతరకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.75 కోట్లు కేటాయించింది. కోటి మందికి పైగా భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జంపన్న వాగు వద్ద నాలుగు కిలోమీటర్ల పొడవున స్నానపు ఘట్టాల దగ్గర 5 వేల షవర్లను ఏర్పాటు చేశారు. బట్టలు మార్చుకునేందుకు 1400 కంపార్ట్‌మెంట్లు ఏర్పాటుచేయగా, 8,400 తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. కాగా ఈ సారి రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతరను ప్లాస్టిక్ రహిత జాతరగా నిర్వహిస్తోంది.
ప్లాస్టిక్‌పై అవగాహన కల్పిస్తూ ఓ భారీ ప్లాస్టిక్ స్టాచ్యూన్‌నే మేడారం ద్వారా ఎదుట ఏర్పాటు చేశారు. మేడారం ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు, ప్లాస్టిక్ రహిత మేడారం జాతరను నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. భక్తులు జాతరలో ఎలాంటి ప్లాస్టిక్‌ను వాడరాదని ఇప్పటికే ప్రభుత్వం కోరింది. అక్కడక్కడ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి భక్తుల వద్ద ఉన్న ప్లాస్టిక్ వస్తువులను సిబ్బంది సేకరిస్తున్నారు.
జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన వెంటనే తెలుసుకోవడానికి 300 సీసీ కెమెరాలతో పాటు ఎనిమిది డ్రోన్ కెమెర్లాను ఏర్పాటు చేశారు. మొత్తంగా అమ్మవార్ల గద్దెల సమీపంలో పోలీస్‌కంట్రోల్ రూమ్, ఐటీడీఏ క్యాంప్ కార్యాలయం, ప్రస్రాలో, గట్టమ్మ ఆలయం వద్ద కలిపి నాలుగు కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు.