అమెరికాలో తెలుగు టెక్కీకి ఆరు నెలల జైలు శిక్ష

By రాణి  Published on  31 Jan 2020 11:27 AM GMT
అమెరికాలో తెలుగు టెక్కీకి ఆరు నెలల జైలు శిక్ష

ముఖ్యాంశాలు

  • ఫార్మింగ్ టన్ వర్శిటీ కేసులో రుజువైన నేరం
  • తెలుగు సాఫ్ట్ వేర్ నిపుణుడు ఫణిదీప్ క్రాంతికి జైలుశిక్ష
  • ఆరు నెలల జైలుశిక్ష విధించిన డెట్రాయిట్ కోర్ట్
  • జైలు శిక్ష తర్వాత భారత్ కి పంపనున్న అధికారులు
  • తెలియక ఉచ్చులో పడ్డానని కోర్టుకు విన్నవించిన ఫణిదీప్
  • వీసా మోసాలను పట్టుకునేందుకు ఐసిఇ అండర్ కవర్ ఆపరేషన్
  • ఫణిదీప్ కి రెండు రోజుల క్రితం జైలుశిక్ష విధించిన కోర్ట్

యూఎస్ లో ఉన్న తెలుగు సాఫ్ట్ వేర్ నిపుణుడు ఫణిదీప్ కర్నాటికి ఆరు నెలల జైలు శిక్షను విధిస్తూ అమెరికాలోని డెట్రాయిట్ న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఫార్మింగ్ టన్ యూనివర్శిటీ ఫ్రాడ్ కేసులో ఫణిదీప్ కి ఈ శిక్ష పడింది. యూఎస్. ఇమిగ్రేషన్, కస్టమ్స్ అధికారులు ఫార్మింగ్ టన్ వర్శిటీ ఫ్రాడ్ కి సంబంధించి, ఫణిదీప్ భారతీయ విద్యార్థులను ఈ వర్సిటీలో చేర్పించడానికి సంబంధించి పటిష్టమైన సాక్ష్యాధారాలను సేకరించి కోర్టుకు సమర్పించారు.

హైదరాబాద్ లో ఇంజినీరింగ్ చదివి పదకొండు సంవత్సరాల క్రితం సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసేందుకు అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడిన ఫణిదీప్ మాత్రం తనకు ఆ వర్సిటీ ఫేక్ అన్న విషయం తెలియదని, వెబ్ సైట్లో చూసి అది నిజమైన యూనివర్సిటీయేనని తానూ మోసపోయాననీ కోర్టుకు విన్నవించినప్పటికీ లాభం లేకపోయింది. ఆ యూనివర్సిటీ ఆన్ లైన్ క్లాసులు ఏర్పాటు చేస్తుందని తనుకూడా నమ్మి ఇతరుల్లాగే మోసపోయానని ఫణిదీప్ కోర్టుకు చెప్పుకున్నాడు.

ఈ కేసులో విచారణ ఎదుర్కున్న ఎనిమిది మంది

ఫణిదీప్ తో పాటుగా కిందడి ఏడాది మరో ఎనిమిది మంది ఆ ఫేక్ యూనివర్సిటీలో విద్యార్థుల్ని చేర్చినందుకు యూఎస్ లో అరెస్టయ్యారు. ఐసిఇ వీసా మోసాల్ని గుర్తించేందుకు ప్రత్యేకంగా ఆ ఫేక్ యూనివర్శిటీని ఏర్పాటుచేసి వేసిన వలలో ఈ చేపలన్నీ పడడంతో పాటుగా చట్ట విరుద్ధమైన పనులు చేస్తున్నట్టుగా రెడ్ హ్యాండెడ్ గా అధికారుల చేతికి చిక్కిన విషయం తెలిసిందే. జనవరి 2019లో ఈ కేసుకు సంబంధించి మిగిలినవారికందరికీ శిక్ష పడింది. ఒక్క ఫణిదీప్ కి మాత్రం రెండు రోజులక్రితం జైలు శిక్షపడింది.

“నువ్వు నేరం చేశావని నేను నమ్ముతున్నాను. కానీ అదేమంత పెద్ద సీరియెస్ నేరం కాదు. కానీ నీకున్న మంచి రికార్డు, నీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్, నీ కుటుంబ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని కొద్దిపాటి శిక్ష విధిస్తున్నాను. నేరం ఏదైనా నేరమే. కాబట్టి శిక్ష అనుభవించక తప్పదు” అని డెట్రాయిట్ కోర్టు న్యాయమూర్తి ఈ కేసు తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించినట్టుగా లోకల్ న్యూస్ పేపర్లు వార్తల్ని ప్రచురించాయి.

ఆరు నెలల జైలు శిక్షను అనుభవించిన తర్వాత ఫణిదీప్ ని యూఎస్ అధికారులు భారత్ కు పంపించేస్తారు. దాదాపుగా 39 మంది భారతీయ విద్యార్థుల్ని నిందితులు ఎనిమిది మందీ కలసి ఆ ఫేక్ యూనివర్శిటీలో చేర్చినట్టు సమాచారం. మొత్తం ఆ ఫేక్ యూనివర్శిటీలో భారత్ తో కలిపి ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఆరొందలమంది విద్యార్థులు చేరినట్టుగా అధికారులు చెబుతున్నారు. ఐసిఇ అండర్ కవర్ ఆపరేషన్ లో భాగంగా వీసా మోసాలకు పాల్పడుతున్నవారిని పట్టుకునేందుకు ఆ ఫేక్ యూనివర్శిటీని తెరమీదికి తెచ్చింది.

Next Story