పెట్రోల్.. డీజిల్ అమ్మకాలు డౌన్.. సర్కారు గుండెల్లో దడ
By సుభాష్ Published on 16 July 2020 5:24 AM GMTకరోనా దెబ్బకు విలవిలలాడుతున్న ప్రభుత్వాలకు మరో పెద్ద సమస్య వచ్చి పడింది. కేసుల తీవ్రతను తగ్గించే విషయంలో కిందామీదా పడుతున్నా కంట్రోల్ కాని పరిస్థితి. దీంతో.. తెలీని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. లాక్ డౌన్ ఎత్తేసి.. అన్ లాక్ కు తెర తీసినా బతుకుబండి పరుగులు తీయని పరిస్థితి. వైరస్ ముప్పు అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో చాలా రంగాలు సరిగా నడవని పరిస్థితి. ఎక్కడి దాకానో ఎందుకు? నిత్యవసరాలైన పెట్రోల్.. డీజిల్ విషయానికే వస్తే.. కరోనా కారణంగా వాటి అమ్మకాలు ఎంతలా తగ్గాయో కొన్ని గణాంకాల్ని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది.
తెలంగాణ రాష్ట్రం విషయానికే వస్తే.. రాష్ట్రంలో 1.20 కోట్ల వాహనాలు ఉంటే.. అందులో సగానికిపైనే హైదరాబాద్.. వాటి శివారులోనే ఉన్నాయి. మొత్తం 33 జిల్లాల్లో 2700 పెట్రోలు బంకులు ఉంటే.. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల కలుపుకొని 628 వరకే ఉన్నాయి. లాక్ డౌన్ విధించటానికి ముందు నెలకు 15 కోట్ల లీటర్ల పెట్రోల్ అమ్మకాలు సాగితే.. 25 కోట్ల లీటర్ల డీజిల్ అమ్మకాలు సాగేవి. దీంతో.. రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున వ్యాట్ (పన్ను) ఆదాయం లభించేది.
లాక్ డౌన్ ప్రారంభమయ్యాక.. ప్రజారవాణా తగ్గిపోవటంతో పాటు.. సొంత వాహనాల్లోనూ బయటకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దీంతో.. ఏప్రిల్.. మే.. జూన్ నెలల్లో వీటి అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. లాక్ డౌన్ మొదలైన తొలినాళ్లలో అమ్మకాలు 15 శాతానికి పడిపోగా.. ఇప్పుడు కాస్త కోలుకొన్న పరిస్థితి. ఫిబ్రవరిలో అమ్మకాల్ని జూన్ తో పోల్చుకుంటే పెట్రోల్ లో 24 శాతం.. డీజిల్ లో 19 శాతం మేర తగ్గినట్లుగా చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్ మీద 35.2 శాతం.. డీజిల్ మీద 27 శాతం మేర వ్యాట్ ను వసూలు చేస్తున్నారు. లాక్ డౌన్ ముందు ప్రతి నెలా పెట్రోల్.. డీజిల్ మీదనే 600-700 కోట్ల వరకు వ్యాట్ ఆదాయం వచ్చేది.
ఇదిప్పుడు భాగా తగ్గిపోయింది. కరోనా పుణ్యమా అని ఇప్పటివరకు రూ.800 కోట్ల ఆదాయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పోయినట్లుగా చెబుతున్నారు. హైదరాబాద్ మహానగరంలోనూ అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. ఊళ్లకు వెళ్లిపోవటం.. వాణిజ్య కార్యకలాపాలు తగ్గిపోవటంతో అమ్మకాలు తగ్గిపోయాయి. దీంతో.. ప్రభుత్వానికి వచ్చే ఆదాయంకోల్పోవటంతో ప్రభుత్వాలకు ఇప్పుడీ సమస్య దడ పుట్టిస్తుంది. సర్కారుకు ఆదాయం వచ్చే కీలక అంశాల్లోనూ కోత పడితే.. ప్రభుత్వ రథాన్ని నడపటం కష్టమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.