చాలా చిన్న కంపెనీ.. శభాష్ అనేలాంటి నిర్ణయాన్ని తీసుకున్నారే

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Aug 2020 11:07 AM IST
చాలా చిన్న కంపెనీ.. శభాష్ అనేలాంటి నిర్ణయాన్ని తీసుకున్నారే

అందరికి మనసు ఉంటుంది.కానీ.. కొందరికి అందులో తడి టన్నుల లెక్కన ఉంటుంది. మిగిలిన వారికి భిన్నంగా.. భావోద్వేంగంతో వెంటనే కనెక్టు అయ్యేలా కొందరు కొన్నినిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు చెప్పబోయేది ఆ కోవకు చెందిందే. గుజరాత్ లోని ఒక చిన్న కంపెనీ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు ఆసక్తికరంగా మారటమే కాదు.. కొత్త చర్చకు తెర తీసిందనే చెప్పాలి. ప్రపంచంలోని ప్రతి మహిళకు ఎదురయ్యే నెలసరికి సమస్య అంతా ఇంతా కాదు.

ఇంట్లో ఉండేవారే.. ఈ బాధ భరించలేక తెగ ఇబ్బంది పడుతుంటారు. అలాంటిది.. ఉద్యోగాలు చేసే మహిళలకు ఎదురయ్యే తిప్పలు అన్ని ఇన్ని కావు. ఈ సమస్యను చాలామంది పట్టించుకోరు. మరికొందరు తమకు సంబంధం లేని సమస్యగా ఫీలయ్యేవారు కనిపిస్తారు. కానీ.. తోపు లాంటి కంపెనీలు సైతం ఆలోచించలేని సున్నితత్త్వంతో ఒక చిన్న కంపెనీ వినూత్న నిర్ణయాన్ని తీసుకుంది. ఆ మాటకు వస్తే.. ఆ కంపెనీలోని ఉద్యోగులు సింగిల్ డిజిట్ దాటని పరిస్థితి. అయినప్పటికి సదరు కంపెనీ తీసుకున్న నిర్ణయం.. రానున్న రోజుల్లో మరిన్ని కంపెనీలు ఫాలో అయ్యేలా ఉండటం గమనార్హం.

గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ కు చెందిన iVIPANAN అనే కంపెనీలో కేవలం 9 మంది ఉద్యోగులే ఉంటారు. ఈ ఆన్ లైన్ సంస్థలో పని చేసే తొమ్మిది మందిలో ఎనిమిది మంది మహిళలే కావటం గమనార్హం. తమ కంపెనీలో పని చేసే మహిళా ఉద్యోగులు ప్రతి నెల ఎదుర్కొనే పిరియడ్స్ ప్రాబ్లంను కంపెనీ వ్యవస్థాపకుడు భౌతిక్ సేన్ రోటీన్ కు భిన్నంగా ఆలోచించారు. వారి వేదనను అర్థం చేసుకున్నారు. నెలవారీగా ఎదుర్కొనే సమస్యకు ఒక చిన్న పరిష్కారాన్ని ఆయన చేతల్లో చేసి చూపిస్తున్నారు.

పిరియడ్స్ కారణంగా అవస్థలు పడే మహిళా ఉద్యోగులకు ఆ ఇబ్బంది నుంచి కాస్త సాంత్వన కలిగించే రీతిలో ఏడాదికి 12 సెలవుల్ని అదనంగా ఇవ్వాలని డిసైడ్ చేశారు. నిబంధనల ప్రకారం కంపెనీ ఇచ్చే సెలవులకు ఈ పన్నెండు సెలవులు అదనమని చెప్పాలి. ఈ కంపెనీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వ.. ప్రైవేటురంగాల్లో పని చేసే మహిళా ఉద్యోగులకు కల్పిస్తే బాగుంటుందని చెప్పక తప్పదు.

Next Story