ధోనిని పొగిడాడు.. పాక్ బోర్డు ఆగ్రహానికి గురైయ్యాడు..!
By తోట వంశీ కుమార్ Published on 26 Aug 2020 3:56 PM ISTభారత్-పాక్ మధ్య ఉన్న ఎలాంటి సంబంధాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఇక ఇరు దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్‌లకు ఉండే క్రేజే వేరు. ఓ పాకిస్థాన్ మాజీ బౌలర్ భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనిని పొగిడి పీసీబీ(పాకిస్థాన్ క్రికెట్ బోర్డు) ఆగ్రహానికి గురైయ్యాడు. అసలేం జరిగిందంటే.. ఆగస్టు 15న క్రికెట్ నుంచి వీడ్కోలు పలుకుతున్నట్లు మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని ఇన్ స్టా ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఈ విషయంపై పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ సక్లయిన్ ముస్తాక్ తన యూ ట్యూబ్ ఛానల్‌లో మాట్లాడాడు. ధోని లాంటి దిగ్గజ ఆటగాడి పట్ల బీసీసీఐ(భారత క్రికెట్ నియంత్రణ మండలి) వ్యవహరించిన తీరు బాగాలేదని అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ధోని వంటి గొప్ప ఆటగాడికి కనీసం వీడ్కోలు మ్యాచ్ నిర్వహించరా అంటూ బీసీసీఐ పైన విమర్శలు గుప్పించాడు. ధోని ఓ గొప్ప ఫినిషర్ అని, అతడో గొప్ప ఆటగాడని.. అలాంటి ఆటగాడికి చివరి మ్యాచ్ ఉండాలని నాతో పాటుగా ఎంతో మంది అభిమానులు కోరుకుంటున్నారని అన్నాడు.
ఇక ధోనిని ప్రశంసించడంతో పాటు బీసీసీఐపై విమర్శలు గుప్పించడంతో పీసీబీ ఆగ్రహంగా ఉన్నట్లు ఆ బోర్డు వర్గాలు తెలిపాయి. కాగా.. ఈ రెండు దేశాల మధ్య ఉన్న పరిస్థితుల కారణంగా పీసీబీ కొన్ని నియమాలు పెట్టింది. అవేంటంటే.. పీసీబీ ఆటగాళ్లు, కోచ్, సహాయ సిబ్బంది ఇంకా ఇందులో పనిచేసే ఎవరైనా సరే బీసీసీఐ గురించి, భారత ఆటగాళ్ల గురించి ఎటువంటి విమర్శలు, కామెంట్లు చేయకూడదు.
కాగా.. సక్లయిన్ ముస్తాక్ పాకిస్థాన్ క్రికెటర్ల డెవలప్‌మెంట్ హెడ్‌గా అలాగే పీసీబీ హై ఫర్మామెన్స్ సెంటర్ లో పనిచేస్తున్నారు. దీంతో పీసీబీ నిమయాలను అతడు ఉల్లగించాడు. ‘ధోనీని ప్రశంసిస్తూ.. బీసీసీఐపై విమర్శలు గుప్పించిన సక్లైన్ తీరుపై పీసీబీ అసంతృప్తిగా ఉంది. ధోనీకి గ్రాండ్ ఫెర్‌వెల్ ఇవ్వకపోవడం గురించి సక్లెయిన్ ప్రస్తావించడం బాలేదు'అని ఓ పీసీబీ అధికారి మీడియాకు తెలిపారు. ఇక చాలా మంది పాకిస్థాన్ మాజీలు భారత క్రికెట్ వ్యవహారాలపైనే ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో పీసీబీ మరికొన్ని కొత్త నియమాలు తీసుకొచ్చింది. అవి ఏంటంటే.. పీసీబీలో పనిచేస్తున్న ఎవరు యూట్యూబ్ ఛానల్ నడపకూడదు. అలాగే వారు ఏ ఛానల్‌కైనా ఇంటర్వ్యూ ఇవ్వాలంటే పీసీబీ నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని సూచించింది.