Paytm కీలక నిర్ణయం: ఇంటివద్దకే నగదు సదుపాయం.. ఎలాగంటే..
By సుభాష్ Published on 16 May 2020 7:39 AM GMTదేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుండటంతో లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నగదు తీసుకోవడానికి ఏటీఎం వెళ్లడం ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని Paytm Payment Bank సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల కోసం ఇంటివద్దకే నగదును అందించడం మొదలు పెట్టింది. ఈ కొత్త సేవల సహాయంతో వారు తమ Paytm Payment Bank యాప్‌లో విత్ డ్రా ఒక అభ్యర్థన పంపవచ్చు. దీంతో మొత్తాన్ని కంపెనీ ఎగ్జిక్యూటివ్ ద్వారా ఇంటికి పంపిస్తారు. పేమెంట్ బ్యాంక్ లో సేవింగ్స్ ఉన్న ఏ సీనియర్ సిటిజన్ అయినా రిక్వెస్ట్ టాబ్‌కు వెళ్లి వారికి కావాల్సిన మొత్తాన్ని యాప్‌లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అయితే బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ మీ మొత్తాన్ని మీ రిజిస్టర్ ఇంటి చిరునామాకు రెండు రోజుల్లో ఇస్తారు. అయితే కనీసం వెయ్యి రూపాయలు, గరిష్టంగా రూ.5వేల వరకూ డెలివరీ ద్వారా తీసుకునే సదుపాయం ఉంది.
అంతేకాదు బ్యాంకు ఇటీవల డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా 400కిపైగా ప్రభుత్వ రాయితీలను నేరుగా వారి పీపీబీఎల్ పొదుపు ఖాతాకు బదిలీ చేయడానికి కస్టమర్‌లను అనుమతిస్తుంది. క్యాష్ డోర్ డెలివరీ బ్యాంకు లేదా ఏటీఎంకు వెళ్లే వినియోగదారుల ఇబ్బందులను తొలగిస్తుంది. అలాగే పేటిఎం పేమెంట్ బ్యాంక్ ద్వారా కస్టమర్లు లక్ష రూపాయల వరకు జమ చేసుకునే అవకాశం ఉంటుంది. పేటీఎం చెల్లింపుల బ్యాంక్ మీ డిపాజిటి్‌పై సంవత్సరానికి 4 శాతం చొప్పున వడ్డీని కూడా చెల్లిస్తుంది.