పైకి రైతు సంక్షేమం..లోపల 'మహా' రాజకీయం..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 20 Nov 2019 5:09 PM ISTఢిల్లీ: మరాఠా యోధుడు, రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. మహారాష్ట్ర రాజకీయాలు చిందరవందరగా ఉన్న నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత చేకూరింది. పైకి మాత్రం మహారాష్ట్ర రైతుల సమస్యలను మోదీ పవార్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించి లేఖ కూడా ఇచ్చారని వార్తలు వచ్చాయి. మోదీ - పవార్ సమావేశానికి అమిత్ షా కూడా హాజరయ్యారు. అయితే..అమిత్ షా మధ్యలోనే వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర సంక్షేమం, అభివృద్ది గురించి వీరిద్దరూ లోతుగా చర్చించారా? రాజకీయాల గురించి లోతుగా చర్చించారా?. పవార్ భవిష్యత్ గురించి లోతుగా చర్చించారా ? అనేది బయటకు రావాల్సి ఉంది. మోదీకి పవార్ లేఖ ఇచ్చారని చెబుతున్నప్పటికీ..లేఖలో ఏముందీ అనేది మోదీ - పవార్‌లకు తప్పితే వేరేవారికి తెలియదు.
పైకి రైతుల గురించి భేటీ అని చెబుతున్నప్పటికీ...మహారాష్ట్ర రాజకీయాల గురించి 'మహా' చర్చ జరిగి ఉంటుందని అంచనా వేయవచ్చు. మొత్తానికి శివసేనకు చెక్ పెట్టడానికి బీజేపీ వదిలిన అస్త్రం శివసైనికులను పూర్తిగా డిఫెన్స్‌లోకి నెట్టిందనే చెప్పాలి. దేశంలోనే సీనియర్ నేతల్లో శరద్ పవార్ ఒక్కరు . రాజకీయ మంత్రాంగం నడపటంలో ఆయనకు ఆయనే దిట్ట. రాజకీయ ప్రయోజనం లేకుండా శరద్ పవార్ అడుగు కూడా ముందుకు వేయరు. గత లోక్ సభ ఎన్నికల తరువాత మోదీ గ్రాప్ పెరుగుతుందనే చెప్పాలి. ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, అయోధ్య కేసు మోదీ హయాంలో పరిష్కారం కావడం ఇవన్నీ కూడా బీజేపీకి కలిసి వచ్చే అంశాలు. పాకిస్తాన్, చైనాల నుంచి భారత్‌ను కాపాడగలిగేది మోదీయేనని గ్రామాల్లో కూడా చర్చించుకుంటున్నారు. 1947 తరువాత భారత విదేశాంగ విధానం మోదీ హయాంలోనే దూకుడుగా ఉంది. ఇవన్నీ కూడా పవార్ ఎనాలిసిస్ చేసుకుంటారు. మహారాష్ట్ర రాజకీయాలు వేరు..లోక్ సభ ఎన్నికల సమయంలో ప్రజల ఆలోచన వేరు. ఈ విషయాలు పవార్‌కు తెలియనవి కావు. ఇవన్నీ తెలిసే పవార్ భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నారని అనుకోవచ్చు.
అయితే..మహారాష్ట్ర రాజకీయాలు మంచి రసకందాయంలో ఉన్నప్పుడు మోదీతో పవార్ భేటీ కావడాన్ని కాంగ్రెస్ నేతలు సునిశితంగా గమనిస్తున్నారు. పవార్‌కు మోదీ ఇచ్చిన ఆఫర్ ఇప్పటికిప్పుడే బయటకు రాకపోయినా..ఢిల్లీ రాజకీయాల్లో ఆ సీక్రెట్ బయటకు రావడం పెద్ద విషయం కాదు.
కాని..ఇక్కడ రెండు ఎత్తుగడలను బీజేపీ అవలంభిస్తోంది. ఒక్కటి శివసేనను రక్షణాత్మక ధోరణిలోకి నెట్టడం. రెండోది..కాంగ్రెస్ - ఎన్సీపీ కూటమిలో అనుమానాలు రేకిత్తించడం. ఇప్పటికైతే ఈ రెండింటిలో బీజేపీ విజయం సాధించిందనే చెప్పాలి. పవార్ లాంటి రాజకీయ యోధుడు బీజేపీ వెంట ..ఎన్డీయేలో ఉంటే లాభమే కాని నష్టం లేదు. ఈ విషయం మోదీ - అమిత్ షాలకు బాగా తెలుసు. అందుకే...శివసేన పోయినా..రాజకీయాల్లో ఆరితేరిన శరద్ పవార్‌కు మోదీ గాలం వేశారనుకోవాలి. ఇక్కడ శివసేన రెండాకులు చదివితే..అమిత్ షా - మోదీ మూడు ఆకులు చదివారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కదా..!