పవన్‌లో ఇంత మార్పేంటి?
By సుభాష్ Published on 4 Sept 2020 11:53 AM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అందరికీ చాలా కొత్తగా కనిపిస్తున్నాడిప్పుడు. మామూలుగా పవన్ ఎంత రిజర్వ్డ్ అన్నది అందరికీ తెలిసిన విషయమే. తన సినిమాల ఫలితాల గురించి కానీ.. రికార్డుల గురించి కానీ.. ఇంకో విషయం గురించి కానీ పవన్ ఎగ్జైట్ కావడం అరుదు. ఆరేళ్ల ముందు నుంచి ట్విట్టర్లో ఉన్నాడు కానీ.. ఆ ఫ్లాట్‌ఫామ్‌ను కేవలం తన రాజకీయ లక్ష్యాలు, విధానాలు, అభిప్రాయాలు వెల్లడించడానికే ఉపయోగిస్తున్నాడు. అంతే తప్ప సరదా ముచ్చట్లు అందులో ఏమాత్రం కనిపించవు. తన పుట్టిన రోజులప్పుడు అభిమానులు, సినీ జనాలు ఎంతగా స్పందించినా.. పవన్ నుంచి బదులే ఉండేది కాదు. అదేమీ పట్టనట్లు ఉండిపోయేవాడు. కానీ ఈసారి మాత్రం పుట్టిన రోజు నాడు పవన్ చూపించిన ఎగ్జైట్మెంట్ అందరినీ షాక్‌కు గురి చేసింది. తన అన్నయ్య చిరంజీవి దగ్గర్నుంచి ‘హృదయ కాలేయం’ దర్శకుడు సాయి రాజేష్, హీరో సంపూర్ణేష్ బాబు వరకు చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరినీ పలకరించాడు పవన్.
ఏదో పొడి పొడిగా, మొక్కుబడి రిప్లైలు ఇవ్వడం కాకుండా ప్రతి బర్త్ డే మెసేజ్‌నూ చదివి.. తగు రీతిలో బదులిచ్చాడు పవన్. కొన్ని ట్వీట్లలో చమత్కారం కూడా చూపించాడు. బ్రహ్మాజీకి బదులిస్తూ అతడిని ‘యాక్టర్’గా అభివర్ణిస్తూ.. తనను మాత్రం ‘నాన్ యాక్టర్’గా పేర్కొనడం ఇందుకు ఉదాహరణ. ఇంకా ఇలాంటి స్పెషల్ ట్వీట్లు చాలానే ఉన్నాయి. సత్యదేవ్‌కు బదులిస్తూ ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’లో అతడి పెర్ఫామెన్స్‌ను కొనియాడటం.. వెంకీ కుడుములకు థ్యాంక్స్ చెబుతూ ‘భీష్మ’ సినిమా ప్రస్తావన తేవడం.. తమిళ నటుడు శివకార్తికేయన్‌కు జవాబిస్తూ అతడి పాట గురించి ప్రస్తావించడం.. ఇలా పవన్ అనేక రకాలుగా ఆశ్చర్యపరిచాడు. తన పుట్టిన రోజైన బుధవారం సాయంత్రం మొదలుపెడితే.. గురువారం అంతా కూడా ఈ ‘రిప్లై’ ప్రక్రియ కొనసాగింది. ఇదంతా చూసి పవన్‌లో ఇంత మార్పు ఎలా వచ్చింది.. అసలేమీ పట్టని వాడు ఇంతగా ట్విట్టర్లో స్పందించడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు. రాజకీయ నాయకుడిగా కొనసాగుతూ మరీ రిజర్వ్డ్‌గా ఉంటే బాగోదని.. అందరినీ ఎంగేజ్ చేస్తూ ఒక పాజిటివ్ ఫీల్ తీసుకురావడం.. మనలో ఒకడు అనిపించుకోవడం అవసరం అని భావించే పవన్ ఇలా మారాడేమో అంటున్నారు విశ్లేషకులు.