నాని దిల్ రాజును బతిమాలుకున్నాడట

By సుభాష్  Published on  3 Sep 2020 5:00 PM GMT
నాని దిల్ రాజును బతిమాలుకున్నాడట

ఇంకో రెండు రోజుల్లోనే అమేజాన్ ప్రైమ్‌లోకి వచ్చేస్తోంది ‘వి’ సినిమా. తెలుగులో థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి ఓటీటీలో నేరుగా రిలీజవుతున్న తొలి పెద్ద సినిమాగా దీన్ని చెప్పొచ్చు. ఈ సినిమా ఓటీటీల్లోకి వస్తుందని లాక్ డౌన్ మొదలైన రెండు నెలలకే ప్రచారం మొదలైంది. మంచి డీల్స్ కూడా వచ్చినట్లు వార్తలొచ్చాయి. కానీ చిత్ర బృందం తలొగ్గలేదు. ఈ సినిమాను థియేటర్లలోనే రిలీజ్ చేయాలనుకుంటున్నట్లు నిర్మాత దిల్ రాజుతో పాటు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ సహా చిత్ర బృందంలోని వాళ్లందరూ స్పష్టం చేశారు. ‘వి’ థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమా అని వాళ్లు నొక్కి వక్కాణించారు. దీంతో ఆ తర్వాత కూడా ప్రయత్నాలు జరిగినా డీల్ తెగలేదు. ఐతే ఈ మధ్యే నిర్మాత దిల్ రాజు మనసు మార్చుకుని ప్రైమ్ వాళ్లకు సినిమాను ఇచ్చేశాడు.

ఐతే దిల్ రాజు ఈ చిత్రాన్ని చాలా ముందే ప్రైమ్‌ వాళ్లకు ఇచ్చేయాలని అనుకున్నాడట. కానీ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ, హీరో నానీలే ఆయన్ని ఆపారట. ఈ విషయాన్ని స్వయంగా ఇంద్రగంటే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ‘‘వి చిత్రాన్ని ఓటీటీల్లో రిలీజ్ చేద్దామని రాజు ముందే అనుకున్నారు. ఒకటికి పదిసార్లు ఆలోచించాకే ఆయనీ నిర్ణయం తీసుకున్నారు. ఐతే నేను, నాని అలా చేయొద్దని బతిమాలుకున్నాం. థియేటర్లు తెరుచుకునే వరకు ఎదురు చూద్దామని చెప్పాం. కానీ అలా ఎదురు చూస్తూనే ఐదు నెలలు గడిచిపోయాయి. ఇంకా ఇలా హోల్డ్ చేయడం కరెక్ట్ కాదని.. ప్రేక్షకుల్లో ఎగ్జైట్మెంట్ ఉండగానే సినిమాను రిలీజ్ చేయాలని భావించి ఓటీటీ రిలీజ్‌కు ఓకే చెప్పాం’’ అని ఇంద్రగంటి తెలిపాడు.

ఇది తన 25వ సినిమా అయినప్పటికీ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేయడానికి అభ్యంతరం లేదని నాని ముందుకు రావడం గొప్ప విషయమని.. అతనెప్పుడూ రిస్క్ చేయడానికి వెనుకాడడని అన్న ఇంద్రగంటి.. సినిమాలో నాని కంటే సుధీర్ బాబు పాత్ర నిడివి కొంచెం ఎక్కువే ఉంటుందని చెప్పడం విశేషం.

Next Story