జ‌గ‌న్ ఆరునెల‌ల పాల‌న‌ను.. ఆరు మాట‌ల్లో తేల్చేసిన ప‌వ‌న్..!

By Medi Samrat  Published on  23 Nov 2019 2:22 PM GMT
జ‌గ‌న్ ఆరునెల‌ల పాల‌న‌ను.. ఆరు మాట‌ల్లో తేల్చేసిన ప‌వ‌న్..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ ఆరు నెలల పాలన గురించి సూక్ష్మంగా ఆరు మాటల్లో చెప్పాలంటే.. విధ్వంసం... దుందుడుకుతనం.. కక్ష సాధింపు.. మానసిక వేదన.. అనిశ్చితి.. విచ్ఛిన్నం.. ఇవి మాత్రమే ఈ ఆరు నెలల పాలనలో జగన్ రెడ్డి ఆనవాళ్ళు అని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. జ‌గ‌న్ ఆరు నెల‌ల పాల‌న‌పై ఓ లేఖ విడుద‌ల చేసిన ఆయ‌న ప్ర‌భుత్వ ప‌నితీరును ఎండ‌గ‌ట్టారు.

ప‌వ‌న్ లేఖ‌లో.. కూల్చివేతల పర్వానికి తెర తీసి తన పాలనలో విధ్వంసానికి శ్రీకారం చుట్టారు. ఉద్దేశపూర్వకంగానే వరద నీటితో రాజకీయ క్రీడలు సాగించారు. ఇసుకను అందుబాటులో లేకుండా చేసి లక్షల మంది కార్మికుల కడుపులు కొట్టారు. భవన నిర్మాణ కార్మికుల్లో బతుకు భయాన్ని సృష్టించి ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి తీసుకువచ్చారు. దుందుడుకుతనంతో చేపట్టిన చర్యలు పాలనలో అపసవ్యతను చాటిచెప్పారు. కాంట్రాక్టులను రద్దు చేయడం ద్వారా వ్యవస్థలను గందరగోళపరిచారు. పోలవరం ప్రాజెక్ట్ పనులు నెలల తరబడి నిలిచిపోయాయి. క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుల పీపీఏల రద్దు వ్యవహారంపై జపాన్ రాయబారి తన అసంతృప్తిని బహిరంగపరిచారు. అమరావతి రాజధానిలో పనులు నిలిపివేయడంపై సింగపూర్ ప్రభుత్వం నిరసన తెలిపి వైదొలగింది. ఈ దుందుడుకు చర్యలతో ఇప్పుడిక అంతర్జాతీయ ఆర్బిట్రేషన్లు ఎదుర్కోవలసిందే.

కక్ష సాధింపుతో ప్రజల్లో భయాందోళనలు సృష్టించి సామాజిక అశాంతి రేపుతున్నారు. శ్రీకాకుళంలోని సామాన్య కార్యకర్త మొదలుకొని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గారి వరకూ పోలీస్ వేధింపులు, కేసులు బనాయిస్తూ కక్ష సాధిస్తున్నారు. మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ గారు ఉరి వేసుకోవడం, ప్రత్యర్థుల బత్తాయి చెట్లు నరికేయడం, వార్తా ఛానెళ్లు బ్యాన్ చేయడం, చట్టాల ముసుగులో జర్నలిస్టులకి సంకెళ్ళు వేయడం, దుర్గి మండలంలో ఊళ్ళకు ఊళ్ళు మగాళ్లు లేకుండా ఖాళీ చేయించడం, తమకు ఓటు వేయని ప్రజలను బెదిరించడం, భయపెట్టడం, రహదారులు మూసేయడం,... సోషల్ మీడియాలో ఎవరు ఒక మాట అన్నా కేసులు పెట్టి వేధించడం, ఊళ్లలో భయానక వాతావరణం సృష్టించడం – ఇవీ జగన్ రెడ్డి గారి పాలనలో కక్ష సాధింపులకు ఆనవాళ్ళు.

ఉద్యోగుల్లో... నిరుద్యోగుల్లో మానసిక వేదన

విలేజ్ వాలంటీర్లు అని 5 లక్షల ఉద్యోగాలు ప్రకటించి 2 లక్షల 89 వేల ఉద్యోగాలు మాత్రమే నింపారు... 35 లక్ష మంది భవన నిర్మాణ కార్మికుల ఉపాధి పోగొట్టారు. 27 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు వలస వెళ్ళిపోయారు. ప్రభుత్వ విధానం వల్ల 1.65 లక్షల మందికిపైగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల భవిష్యత్ గాలిలో ఉంది.

90 వేల పైచిలుకు ఉన్న తెలుగు ఉపాధ్యాయులలో – ఆంగ్ల మాధ్యమం పేరు మీద ఆంగ్లం రాకపోతే వారి స్థానంలో విలేజ్ వాలంటీర్స్ లాగా కొత్తవారిని పెట్టుకొంటారు అనే భయాలు నెలకొన్నాయి. పార్టీలనీ, వేరే కులాలని వేధిస్తుంటే స్థానిక వ్యాపారవేత్తలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోవడం, పెట్టుబడులు ఆంధ్రకి ఇక రావు.. తద్వారా ఉద్యోగావకాశాలు ఉండవు అనే నిస్సహాయత, మానసిక వేదననిరుద్యోగుల్లో నెలకొన్నాయి.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటి?

వేల కోట్ల పెట్టుబడి పెట్టిన అమరావతి రాజధాని ఉంటుందా అనే అనిశ్చితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం ఏపీకి నిధులు ఇస్తుందా? నవరత్నాలకు నిధులు ఉన్నాయా? ప్రభుత్వ ఉద్యోగుల నెలవారీ జీతభత్యాలకు అవసరమైన డబ్బులు ఉన్నాయా? రూ. రెండున్నర లక్షల కోట్లపైన అప్పు ఉంది. పెట్టుబడులు లేవు... పెట్టుబడులు పెట్టినవారిని పంపేశారు. అసలు రాష్ట్ర ఆర్థిక స్థితి ఏమిటనే ఆందోళన నెలకొంది.

తెలుగు భాష... భారతీయ సనాతన ధర్మం విచ్ఛిన్నం

ఆంగ్ల భాష బోధన అనే వాదనతో తెలుగు భాష, తెలుగు సంస్కృతి, భారతీయ సనాతన ధర్మం విచ్ఛిన్నానికి శ్రీకారం చుట్టారు.

151 అసెంబ్లీ సీట్లు ఉన్న వైసీపీ హానికర ధోరణిని ఇకనైనా ఆపాలని కోరుకొందాం' అంటూ జ‌గ‌న్ పాల‌న‌పై ప‌వ‌న్ లేఖాస్త్రం సంధించారు.

Next Story