కార్మికుల పొట్టకొట్టొద్దు.. నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
By తోట వంశీ కుమార్ Published on 2 May 2020 9:33 PM ISTకరోనా కారణంగా దేశంలో అల్పాదాయ వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పనిచేస్తున్న 1400 పొరుగుసేవల (ఔట్ సోర్సింగ్) సిబ్బందిని తొలగించడం అన్యాయమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కార్మికుల పొట్ట కొట్టొదన్నారు. కార్మికులను ఉద్యోగం నుంచి తొలగించడం సరైన నిర్ణయం కాదన్నారు. గత 15 ఏళ్లుగా ఆ కార్మికులు టీటీడీలో పనిచేస్తూ స్వల్ప వేతనాలు తీసుకుంటున్నారని పవన్ పేర్కొన్నారు.
ఏ ఒక్క కార్మికుడిని ఉద్యోగం నుంచి తొలగించరాదని.. లాక్‌డౌన్ కాలంలో వారికి క్రమం తప్పకుండా వేతనాలు అందించాలని ప్రధాని మోదీ ప్రకటించడాన్ని పవన్ గుర్తు చేశారు. ప్రధాని ప్రకటనను పట్టించుకోకుండా కార్మికులపై వేటు వేయడం సరికాదన్నారు. కార్మికుల తొలగింపు నిర్ణయాన్ని వెంటనే టీటీడీ ఉపసంహరించుకోవాలని పవన్ విజ్ఞప్తి చేశారు.