విశాఖ తీరంలో ఎగిసిపడిన జన కెరటాలు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Nov 2019 5:04 PM GMT
విశాఖ తీరంలో ఎగిసిపడిన జన కెరటాలు..!

ముఖ్యాంశాలు

  • లాంగ్ మార్చ్ సూపర్ సక్సెస్
  • అంచనాలకు మించి వచ్చిన జనం
  • లాంగ్ మార్చ్ ప్రభుత్వానికి హెచ్చరికే..!
  • లాంగ్ మార్చ్ ను రాజకీయ కోణంలో కాకుండా ప్రజాకోణంలో చూడాలి

విశాఖ తీరంలో జన కెరటాలు ఎగిసి పడ్డాయి. ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగానే కనిపించింది. ఇసుక కొరత, భవన నిర్మాణ కూలీల ఆత్మహత్యలను ఖండిస్తూ ఏర్పాటు చేసిన లాంగ్ మార్చ్ విజయవంతం అయిందనే చెప్పాలి.జనసేనాని విశాఖలో అడుగుపెట్టినప్పటి నుంచి అభిమాన తరంగాలు ఎగిసి పడ్డాయి. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి భారీ కాన్వాయ్ తో పవన్ కల్యాణ్ మద్దిలపాలెం చేరుకున్నారు. అక్కడ తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేసి లాంగ్ మార్చ్ ప్రారంభించారు.

మద్దిలపాలెం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు సాగిన లాంగ్ మార్చ్ లో పవన్ కల్యాణ్ నినాదాలు మారుమోగాయి. రోడ్లు, కాంప్లెక్స్ లు జనంతో నిండిపోయాయి. జనసైనికుల నినాదాలు సముద్రపు హోరుతో తలపడ్డాయి. రెండు గంటలకు పైగా సాగిన లాంగ్ మార్చ్ లో జన సైనికులు అనుకున్నదానికంటే ఎక్కువే వచ్చినట్లు కనిపించింది. విశాఖలోని నాలుగు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. వారు జనాల్ని తరలించారని వైఎస్ఆర్ సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎంత తరలించినా..పవన్ సభకు జనం అంచనాలకు మించి వచ్చారనే చెప్పాలి.



ఇసుక విధానంలో వైఎస్ జగన్ ప్రభుత్వం విఫలమైందని అమరావతికి వినిపించేలా చెప్పడానికి వేల మంది జనం తరలి వచ్చారని అనిపించింది.ఇసుక కొరతతో పనులు లేక 36 మంది భవన కార్మికులు చనిపోయారని జనసేన నాయకులు చెబుతున్నారు. వీరికి రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని పవన్ సభలో డిమాండ్ చేశారు. కార్మికుల కష్టం తెలుసుకుని ప్రభుత్వాలు పాలన సాగించాలని చెప్పారు.

వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు కూడా కాకముందే పెద్ద ఎత్తున వ్యతిరేకత కనిపించడం పాలనలోని లోపాలను ఎత్తి చూపుతుంది. ఇసుక రీచ్ లు టీడీపీ నేతలు దగ్గర ఉన్నాయని భావిస్తే..పకడ్బందీగా చట్టం అమలు చేసి ..కొరత లేకుండా చూడాల్సింది. వరదలు వచ్చాయని అందుకే ఇసుక దొరకడంలేదని అధికారులు , వైఎస్ఆర్ సీపీ నేతలు చెబుతున్నప్పటికీ...ప్రజలకు అవన్నీ అనవసరం. సమయానికి ఇసుక ఉందా?లేదా అనే సగటు యాజమాని, వర్కర్ ఆలోచిస్తాడు. ఈ విషయంలో వైఎస్ జగన్ అధికారుల బుర్రతో కాకుండా ప్రజా కోణంలో ఆలోచించాల్సి ఉంది.

ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని సరైన సమయానికి అందివాచేవాడే పాలకుడు.లేకపోతే..ఈ రోజున విశాఖలో ఎగిరిపడిన జన కెరటాలు. ఏదో ఒక రోజు పెను తుఫానులా మారి అమరావతిని తాకుతాయని పాలకులు గుర్తెరగాలి.

ప్రతిపక్షం పెట్టిన సభ విజయవంతం అయిందంటే..పాలకులకు అదొక హెచ్చరిక. విశాఖలో లాంగ్ మార్చ్ ను ఏపీ ప్రభుత్వం రాజకీయ కోణంలో కాకుండా..ప్రజా కోణంలో చూస్తే..భవిష్యత్తులో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి దోహద పడుతుంది.

Next Story